పుట:Naajeevitayatrat021599mbp.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయం చెప్పగా, ప్రకాశంగారు వెంటనే ఆ ఫైలు తెప్పించారు. మీదచెప్పిన విషయాలను నేను ఫైలులో చదివి, ప్రకాశంగారికి విషయమంతా బోధపరిచాను. ఇపుడా నోటీస్ ఇవ్వడానికి కారణం లెఫ్టినెంట్ కర్నల్ శాస్త్రి, డెపుటేషన్‌పైన ఏదో పెద్ద ఉద్యోగానికి విదేశం వెళ్లడానికి యత్నించడమే. ప్రకాశంగారు ఫైలులో వున్న విషయాలు గట్టిగా వ్రాసి - గవర్నమెంటు నోటీస్ ఉపసంహరించు కోవాలని, లేకపోతే ఈ విషయం కాబినెట్‌లో చర్చకు తేవాలనీ వ్రాశారు.

ఈ ఫైలు మామూలు పద్ధతిగా గవర్నర్‌గారికి వెళ్ళింది. గవర్నర్‌గారు - ఒకసారి నేరారోపణ జరుగగా, పూర్తిగా విమర్శించి ఒక ఉద్యోగిని నిర్దోషి అని తీర్మానించిన తర్వాత, రెండవ మారు అది నేరారోపణ చేయడం ఎలా సంభవ మవుతుందనీ, కాన్ఫిడెన్షియల్ ఫైలు పరిశుభ్రంగా ఉన్నందున శాస్త్రిగారి మీద చర్య తీసికొనే వీలులేదనీ ప్రకాశంగారితో ఏకీభవిస్తూ వ్రాయగానే దానిపై రేగిన గాలి దుమారం ఆగి పోయింది.

జి. వి. రావుగారు - ఆయన పని

ఆ రోజులలో లేకలేక ఒక తెలుగు వ్యక్తి రాజధాని నగరంలో పెద్ద ఉద్యోగిగా ఉండడం తటస్థించింది. ఆయన పేరు జి. వి. రావు. ఆయన చెన్నరాష్ట్రం అంతటికీ శానిటరీ ఇంజనీరుగా ఉండేవారు. మొదట విశాఖపట్నం నీటి సప్లై స్కీములో నీటి సూపర్ వైజరుగా పనిచేయ నారంభించిన ఆయన, మెల్లమెల్లగా ఈ పెద్ద పదవికి చేరుకొన్నాడు. ఆ మధ్యలోనే ఎప్పుడో ఇంగ్లండు వెళ్ళి, డిప్లమో ఒకటి సంపాదించి దాంతోబాటు ఒక పాశ్చాత్య స్త్రీని వివాహమాడి, పెద్ద ఉద్యోగిగా పరిణమించాడు. జస్టిస్ పార్టీ పాలన కాలంలో ఈయన ఇలా పైకి వచ్చాడు. 1932 - 33 ప్రాంతాలలో నేను విశాఖపట్నంలో మునిసిపల్ కౌన్సిలర్‌గా ఉన్నపుడు ఈయనతో నాకు నీటి సప్లై స్కీము విషయంలో తగాదా వచ్చింది. ఇనుప గొట్టాలద్వారా నీరు తీసుకురావాలని నేను వాదించగా, సిమెంటు పైపుల ద్వారా తెస్తే చవక అవుతుంది గనుక వాటితో స్కీము నడిపించాలని ఆయన అన్నాడు. ఈ సిమెంటు