పుట:Naajeevitayatrat021599mbp.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షులు ఇలా అల్లర్లు చేయిస్తూండడం మామూలే," అని చెప్పారు. ఎదురుగుండా దూరంగా ఉన్నవారంతా రాజావారి మనుషులు అని కొందరిని చూపించారు. ఈ లోపున డప్పుల చప్పుళ్ళు, ఏనుగు తమ మధ్యలో నడవడంచేత ప్రేక్షకులు చేసే గోల, కేకలు హెచ్చయినాయి. ఏనుగు నెహ్రూగారికి కొంచెం దగ్గరపడింది. ఆవేశంతో నెహ్రూగారు దాని తొండంపైకి ఎగరబోయారు. అప్పుడు , అంతవరకూ నిర్లిప్తంగా దూరంగావున్న పోలీస్‌వారు కొంతమందీ, రాజుగారి మనుషులు కొంతమందీ వచ్చి ఆ ఏనుగును ప్రక్కకు మళ్ళించగా, వారూ వారి అనుయాయులూ గోల చేసుకుంటూ, డప్పులతో వెళ్ళిపోయారు. తర్వాత సభలో వేరే అల్లరి ఏమీ జరగలేదు.

ఈలాగే మరికొన్ని రోజులయినాక, అదే స్థలానికి ప్రకాశంగారు, శ్రీమతి సరోజినీ నాయుడు గారు ఎన్నికల ప్రచారంకొరకు వెళ్ళటం తటస్థించింది. అప్పుడుకూడా ఏనుగుతప్ప మిగిలిన అల్లరంతా రాజావారి మనుషులు చేశారు. అయినప్పటికీ, ప్రజా బాహుళ్యం హెచ్చు అవడంవల్ల, కాంగ్రెసు నాయకులపట్ల వారి అనురాగప్రేమలు హెచ్చవడంవల్ల సభకు అంతరాయం కలగలేదు. ప్రత్యర్థి అయినవారు కూపస్థ మండూకంలా తామే గొప్పవారమని, తాము తప్ప వేరే లోకం లేదని అనుకోవడం చాలా పొరబాటని సరోజినీ నాయుడుగారు మందలించారు. ఆ ఎన్నికలలో గిరిగారు గెలిచారు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రకాశంగారు ఆంధ్రప్రాంతంలో అన్ని జిల్లాలలోనూ నిర్విరామంగా ప్రచారం చేశారు. దీనికి ఫలితంగా కాంగ్రెసుకి అఖండ విజయం కలిగింది. రెండు స్థానాలుమాత్రం పోయినవి. ఒకటి చల్లపల్లి జమీందారు జస్టిస్‌పార్టీ అభ్యర్థిగా గెలుచుకున్నది; రెండవది నరసాపురంలో జస్టిస్‌పార్టీ నాయుడుగారు గెలుచుకున్నది. ఈ రెండుచోట్ల కాంగ్రెసు అభ్యర్థులు నిర్దుష్టమయిన దేశసేవా పరాయణులే అయినప్పటికీ ఓటమి కలిగింది.[1]

  1. గెలిచిన జస్టిస్‌పార్టీ వారిద్దరూకూడా వారి ఎత్తుగడలు మార్చుకొని, తరువాత కాంగ్రెసులో చేరి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినాక కాంగ్రెసుపార్టీ పక్షాన మంత్రులైనారు