పుట:Naajeevitayatrat021599mbp.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికి జవాబుగా, "ఇటువంటి ప్రశ్న మీ మనసులో ఎలా ఉద్భవించింది? ఆయన లేకున్నట్టయితే శాసనసభ ఎలా ఉండగలదు?" అన్నారు.

ఆ మాటలు వినేసరికి రాజాజీకి బ్రహ్మాండమైన ఆగ్రహం వేసి, "సరే లేవయ్యా! ఆ దివాలా కోరుతో నువ్వు కాపురం చేయవయ్యా!" అని మందలించి కూచున్న స్థలంనుంచి లేచిపోయారు. రైలు టైముకూడా అయిపోయింది. అయ్యంగారు దిగిపోయారు. రైలు కదిలింది.

బొంబాయి వెళ్ళాక పటేలుగారున్నూ, వర్కింగు కమిటీవారున్నూ మొదట అనుకున్నట్లే ప్రకాశంగారిని చెన్నపట్టణానికి ఏర్పాటయిన నియోజక వర్గంలోనే స్థిరపరిచారు. ఇది ఆ ఎన్నికలో మొదటి ఘట్టం.

జమీందారులతో పోరాటాలు

దేశంలో కాంగ్రెసువారియెడల అభిమానం పెల్లుబికి పోయింది. విశాఖపట్నం జిల్లా బొబ్బిలి నియోజక వర్గంలో ఇప్పుడు రాష్ట్రపతిగారయిన గిరిగారిని కాంగ్రెసు అభ్యర్థిగా నిర్ణయించడమైంది. అప్పటికి గిరిగారు కేంద్ర శాసన సభలో సభ్యులుగా ఉండేవారు. బొబ్బిలిలో ఈయన ప్రత్యర్థి బొబ్బిలి రాజావారే. ఆయన అపుడు చెన్నరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఎన్నికల సందర్భంగా నెహ్రూగారు మన రాష్ట్రానికి రావడం సంభవించింది. ప్రకాశంగారూ, ఆయనా కలసి బొబ్బిలికి ఎన్నికల ప్రచారంకోసం వెళ్ళారు. తీరా వెళ్ళేసరికి బొబ్బిలి రాజావారు బొబ్బిలిలో లేరు. నెహ్రూగారు స్థానిక కాంగ్రెసువారు ఏర్పాటుచేసిన సభాస్థలానికి చేరేసరికి, డప్పులు - వాయించుకుంటూ కొంతమంది, కేకలువేస్తూ కొందరూ నాలుగువైపుల తిరగడం ఆరంభించారు. ఆయన మాట్లాడడానికి ప్రారంభించేసరికి డప్పులు చేసేగోల చాలదని ఒక ఏనుగుకూడా నడిపించుకుంటూ ఒక మావటివాడు ప్రేక్షకుల గుంపులోకి వచ్చాడు. సభలో గగ్గోలు బయలుదేరింది. ఇదేమిటని నెహ్రూగారు అడగగా, స్థానిక కాంగ్రెసు నాయకులు, "ఈ ఊళ్ళో కాంగ్రెసు మీటింగులు జరగకూడదని రాజావారి మను