పుట:Naajeevitayatrat021599mbp.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాఠకులకు విజ్ఞప్తి

1937, 1946, 1953 సంవత్సరములలో - ప్రకాశంగారి మంత్రివర్గ సమయంలో జరిగిన కార్యములు చెపుతున్నప్పుడు, కొన్నిచోట్ల 'నేను ఇది చేశాను,' 'అది చేశాను' అని వ్రాయడం జరిగింది. ప్రకాశంగారి పరిపాలనా సమయంలో జరిగిన దానికి నేను నిమిత్తమాత్రుణ్ణి. మూలకారణం ప్రకాశంగారే. అందుచేత ఆ విషయాలు ప్రకాశంగారి జీవిత చరిత్రలో వ్రాయవలసి వచ్చింది. అంతేకాని - నా ఉపజ్ఞను, కార్యజ్ఞతనుగూర్చి వ్రాసికొనేందుకు మాత్రం కాదు.

మరొక్క విషయం - నేను వ్రాసింది అనుబంధ గ్రంథము. ప్రకాశంగారు - రెవిన్యూ శాఖామాత్యులుగా, చెన్నరాష్ట్ర ప్రధానామాత్యులుగా, ఆంధ్రరాష్ట్రపు ప్రథమ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పరిపాలనా సంబంధ మయిన విషయాలు మాత్రం ఇందులో కలవు. రెవిన్యూ మంత్రిగాను, తర్వాత ముఖ్యమంత్రిగాను ఆయన ఉన్న కాలంనాటి కాగితాలు చాలమటుకు చెన్నపట్నంలోనే మిగిలి పోయాయి. హైదరాబాదు నేషనల్ ఆర్కైప్‌జ్‌లో కొన్ని మాత్రమే కలవు. 1953 - 54 సంవత్సరముల కాగితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వశంలోనే ఉన్నాయి. అయినా - వాటికి ఇండెక్సు, రిజిష్టరులు లేకపోవుటచేత, ఆ రికార్డులు అసలు చూడలేక పోయాను. చాలామటుకు జ్ఞాపకం మీదనే ఆధారపడి వ్రాశాను. రికార్డులు దొరికినప్పుడు మరొక ముద్రణావసరమున పొరబాటులు సవరించడానికి యత్నిస్తాన.

లోటుపాట్లు చదువరులు మన్నించెదరు గాక!


తెన్నేటి విశ్వనాథం.
23 - 6 - 1972