పుట:Naajeevitayatrat021599mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దగ్గరకి వెళ్ళడం పడవ యెక్కలేకపోవడం జరిగింది. చాలాసేపు ప్రాణాల మీద ఆశ ఒదులుకొని ఆ మహానదితో యుద్ధం చేశాను. చిట్టచివరికి నేనే నా స్నేహితులికి తెడ్డు అందివ్వండని సూచించాను. దాంతో వాళ్ళు తెడ్డు అందివ్వగా దాని ఊతంమీద పడవపైకి వచ్చాను. ఈ రీతిగా మృత్యు సన్నిధికి వేంచేసి వెంట్రుకవాసి తేడాలో అక్కడి నించి బయటపడ్డాను.

1889వ సంవత్సరంలో ప్రైవేటుగా చదివి మెట్రిక్యులేషన్ పాసయినాను. ఆ వేసవికాలంలో ఒంగోలు ఒదిలినప్పటినించీ మళ్ళీ ఒంగోలు వెళ్ళలేదు. ఆ తరవాత నేను కొద్దిరోజులపాటు రాజమహేంద్రవరంలో స్వంతంగా వండుకుని భోజనం చేసేవాణ్ణి. తరవాత కొన్నాళ్ళపాటు హోటల్లో భోజనం చేశాను. చివరికి నా చదువుకి తగిన భోజనవసతి కుదరకపోవడంతో మా అమ్మమ్మగారిని ఒంగోలునించి తీసుకువచ్చాను. మేము ఆ తరవాత ఇన్నీసుపేటలో నోరివారి ఇంట్లో ఒక చిన్నగదిలో ఉండేవాళ్ళము.

మెట్రిక్యులేషన్ పరీక్ష పాసయిన తరవాత, "మరి ముందు సంగతి ఏమిటీ?" అనే సమస్య వచ్చింది. నా లక్ష్యమెప్పుడూ ప్లీడరీ మీదే వుండేదని యిదివరకే వ్రాశాను. రాజమహేంద్రవరంలో రౌడీ జనాభాతో జోస్తీగా వుండే సమయంలో కూడా నా మనస్సు ఆ న్యాయవాది వృత్తిమీదనే లగ్నమై వుండేది. మెట్రిక్యులేషన్ పాసవడంతోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా సంపాదించడానికి అవకాశం ఉన్న రోజులవి! స్నేహితులు కొందరు "ఎన్నాళ్ళు నువ్వు నాయుడు గారిమీద ఆధారపడతావు? ఏదో మెట్రిక్యులేషన్ అయింది కనక మరి నౌఖరీలో జేర," మని సలహాయిచ్చారు. నా దృష్టి అయితే కళాశాలలో చదివి ప్లీడరీ చెయ్యాలని వుండేది. కాని నిజంగా నాయుడుగారికి నే నిచ్చేశ్రమ చూస్తే స్నేహితులు చెప్పిన సలహా న్యాయమైనదేమోననిపించింది.

గుమస్తా పని చేస్తూ కూడా ప్రైవేటుగా ప్లీడరీకి చదివే అవకాశం వుండడం చేత చిట్ట చివరికి ఇష్టం లేకుండానే రాజమహేంద్రవరం సబ్