పుట:Naajeevitayatrat021599mbp.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భేదమున్నవారితో గూడా మీరు నెట్టుకొస్తూనే ఉన్నారు. అందువల్ల ఏ సందర్భంలో ఏ ఉద్యమం ఎల్లా ఆరంభించాలో తమకు బాగా తెలుసు. మీ ఉద్యమాలన్నీ ఎప్పుడూ ఉన్నత స్థాయిని అందుకుంటూనే ఉన్నా" యన్నాను.

"నా ఉద్దేశంలో ఈ ప్రస్తుత ఉద్యమం ఈ యుద్ధసమయంలో స్వరాజ్య సంపాదన కోసం లేవదీసింది కాదనీ, భారతదేశానికి స్వాతంత్ర్య మివ్వ నిరాకరించిన కారణంగా, వారికి - ఆ బ్రిటిషువారికి - వారి చర్యలకూ కేవలం సవాలుగానే ఈ ఉద్యమం ప్రారంభించ బడింది గనుక భారతదేశం తన మార్గం తాను చూసుకోగల శక్తికి ఆంగ్లేయుల అడ్డును నామ మాత్రంగా సడలించడానికీ, భారతీయుల అనుమతీ, అంగీకారమూ అన్నవి లేకుండా ఈ యుద్ధాన్ని తీసుకువచ్చి వారి నెత్తిన రుద్దడంచేత కేవలం సవాలుగా నడుపబడే ఈ ఉద్యమం పట్ల, ఎవరికి ఎలాంటి అనుమానమున్నా, నాకేమీ లే"దన్నాను.

అభ్యంతరాలకు గాంధీజీ జవాబు

వినోబా భావేను ప్రప్రథమ వ్యక్తి సత్యాగ్రహిగా తాను నిర్ణయించిన సందర్భంలో వచ్చిన అభ్యంతరా లన్నింటినీ గాంధీగా రీవిధంగా సమాధానమిచ్చారు. "నేను వినోబా భావేను ఎన్నుకొనడానికి ముఖ్య కారణం ఆయన స్వయంగా అహింసావాది. నా తర్వాత నాస్థానాన్ని ఆక్రమించగల సమర్థుడు ఆయనే. ఈ ఇరవై సంవత్సరాలూ ఆయన నిర్మాణాత్మక కార్యక్రమంలో మునిగి తేలుతున్నాడు."

కార్యదర్శి కృపాలనీ అన్నాడు: "వినోబా భావే మనలో ఎవరితో నయినా సమానంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఘనతకు ఎక్కే ఉండును. ఆయన విషయం ఎందువల్లనో ఇంత వరకూ గాంధీగారు పట్టించుకోని కారణంగా ఆయన అల్లాగే తనకు నిర్దేశింపబడిన కార్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తూన్నాడు. ఈపట్టున గాంధీగారు ఆయన విషయం పట్టించుకున్నారు కాబట్టి, ఆయన కీర్తి ప్రతిష్ఠలు దేశీయులు గ్రహించ గలుగుతారు."