పుట:Naajeevitayatrat021599mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండేవాళ్ళము. అందులో నేను మంచి ఆటగాడి కిందే లెఖ్ఖ. ఇక దీపావళి పండుగ రోజులుసంగతి చెప్పనే అక్కరలేదు. పండుగనాడు రకరకాల బాణా సంచాలతో యుద్ధాలు సాగవలసిందే! పండుగ పది రోజులు వుంది అనగా ఈ మందుగుండు సామాను తయారు చేసి పార్టీలకి సవాళ్ళు చేసేవాళ్ళము. నేను ఈలాంటి ఒడుదుడుకు పరిస్థితుల్లో చదువుకుంటూ వుండేవాణ్ణి.

అప్పట్లో రాజమహేంద్రవరంలో రౌడీజట్లు బాగా వుండేవి. పెద్దమనుష్యు లనుకునే వాళ్ళల్లో చాలామందికి ఈ రౌడీలతో సంబందాలు వుండేవి. చూస్తూ వుండగా ఏ వీథిలోనో రెండుపార్టీలు తటస్థపడి అమాంతంగా ఒకళ్ళని ఒకళ్ళు పడపడ కొట్టుకొంటూ వుండేవాళ్ళు. నేను కూడా ఈ పార్టీల గందరగోళంలో పడ్డాను. ఆ పడడంలో సంఘంలో కిందశ్రేణిలో వుండే జనంతో సంపర్కం కలగడంలో ఆశ్చర్యం ఏమి వుంది? చేపలు పట్టుకుని జీవించే బెస్తలతోనూ, వాళ్ళ నాయకులతోనూ చేతులు కలపవలసి వచ్చింది. వాళ్ళ అభిమానం సంపాదించడానికి వాళ్ళ యిళ్ళకికూడా వెళ్లేవాణ్ణి. వాళ్లు కల్లు తాగుతూ వుంటే పక్కని వుండవలిసిన అవస్థ కూడా కలిగేది. కాని, యెన్నడూ అది ముట్టుకోవాలనే ధోరణిమాత్రం కలగలేదు.

ఈ కాలంలోనే నాకొక బ్రహ్మాండమైన గండం తప్పింది. ఒకసారి గోదావరి మంచి వరదలో వున్నప్పుడు నేనూ కొంతమంది స్నేహితులూ కలిసి ఒక చిన్న పడవ ఏట్లోకి తోసుకువెళ్ళాము. తెడ్డు ఒకటే దానికి చుక్కాని. నేను చుక్కానిదగ్గిర వున్నాను. పడవ కోటి లింగాలదాకా బాగా ఎగువుకి పోనిచ్చి ఏట్లోకి వాలుగా ఒదిలి వేశాము. నావ ప్రవాహంలో మంచి జోరుగా వస్తూ వుంటే నా చేతిలో వున్న చుక్కాని జారిపోయింది. దానికోసం నేను గభాలున ఏట్లోకి దూకాను. దాంతో నా స్నేహితులు కంగారు పడ్డారు. నేను తెడ్డు పట్టుకుని పడవ దగ్గిరకి చేరాను; కాని పడవ యెక్కలేకపోయాను. పడవలో వున్న స్నేహితులు నన్ను చూసి కంగారు పడడమే కాని తెడ్డు చేతి కందివ్వాలని యెవరూ అనుకోలేదు. నేను అల్లాగే ఒకటిరెండు సార్లు పడవ