పుట:Naajeevitayatrat021599mbp.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయకులుగానూ, వినాయకులుగానూ ఉండే పెద్దలు, చిన్నలు అందరూ జెయిలు గోడల వెనకాలకు దారి చూసుకున్నారు.

మళ్ళీ జెయిలుకి

నేను మొదట్లో డిసెంబరు ఆఖరుకి జైలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నా, తప్పని సరిగా నా అభిప్రాయాన్ని మార్చుకుని ఉద్యమాన్ని నడపడానికే ఉద్యుక్తుడ నయ్యాను. అందువల్ల మా రాష్ట్ర కాంగ్రెసువారి ఆదేశానుసారంగా మొదటి జట్టులోనే 1940 నవంబరు 26 న జెయిలుకు సిద్ధమయ్యాను.

లోగడ నేను ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చిఉన్నా రాబోయే సంఘటనల దృష్టితో, నన్నే తిరిగి రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీకి అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఆ స్థానంలో 1937 జూలైలో రాజ్యతంత్రాన్ని చేపట్టే పర్యంతమూ ఉన్నాను. తిరిగీ జెయిలుకు వేళ్ళేలోపల, సుమారు తొమ్మిదిమాసాలపాటు, యావత్తు రాష్ట్రాన్ని పర్యటించి దానిని సరిఐనదారిలో పెట్టమని నన్ను కోరారు.

నేను రాష్ట్రం అంతా పలుసార్లు పర్యటించాను. ఆయా జిల్లాలలో స్వయంసమృద్ధి ప్రాతిపదికగా అనేక గ్రామాలలో నిర్మాణ కార్యక్రమం సాగించాను. పశ్చిమ గోదావరి జిల్లాలోని జోగన్న పాలెంలోనూ, ఆమదాల దిమ్మె అనబడే అనంతపురం జిల్లా గ్రామంలోనూ అలాంటి కార్యక్రమాలు ఆరంభించాను.

తతిమ్మా పది జిల్లాలలోనూ కూడా స్వయంసమృద్ధి పథకాలకు అనుగుణంగా ఉంటాయను కున్న పల్లె లన్నింటినీ విమర్శనాత్మక దృష్టితో పరిశీలించాము. ఆయా గ్రామాల ఆర్థికాది పరిస్థితులనూ గమనించాము. నాతోడి వర్కర్లను అప్రమత్తతో ఉండమనీ, ఉద్యమం ఏ క్షణాన్నయినా ప్రారంభించబడవచ్చుననీ హెచ్చరిక చేశాను.

దక్షిణభారతంలో ఆంధ్రావనేగాక, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాలు కూడా ఇటువంటి స్వాతంత్ర్య సమరాలలో ఎప్పుడూ వెనకాడవన్న సంగతి నాకు తెలుసు.