పుట:Naajeevitayatrat021599mbp.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండడాన్ని, ఈ సారి రాజీ ఏదో జరుగుతుందనే అందరమూ ఆశపడ్డాము. వైస్రాయ్ ఇచ్చిన ఘనమైన 1940 ఆగస్ట్ 'ఆఫర్‌' ప్రకారం, ప్రభుత్వ నిర్వాహక సంఘం (Executive Council) సభ్యులను విస్తరింప జేయడం విషయంలో బ్రిటిష్‌ వారూ కాస్తంత దారిలోకి వచ్చారు.

కాని అది కాంగ్రెసువారి వాంఛల దృష్టిలో బహుస్వల్పం. కాంగ్రెసు వారు ఆ ఆగస్టు ప్రతిపాదనలకు ఎంతమాత్రమూ ఒప్పుకో లేదు. 1940 లో పూనాలో ఆమోదించ బడిన కాంగ్రెసు తీర్మానాన్ని అనుసరించి ఉన్న కోర్కెలకు ఆంగ్లేయులు వెంటనే అంగీకరించాలని కాంగ్రెసువారు తమ సూచనలను అందజేశారు. ఆ ప్రకారం జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలని (National and Provincial Governments) తమ వాంఛితార్థంగా కాంగ్రెసువారు తెలియబరచారు.

అహింసాత్మక విధానానికి స్వస్తిచెప్పి, కాంగ్రెసువారు జనాన్నీ, ధనాన్నీ సేకరించి, బ్రిటన్‌పై కాలుదువ్విన నియంతల తలదన్నడానికి ఒప్పుకున్న కారణంగా ఆంగ్లేయులూ కొంత వరకూ మెత్తబడ్డారు. మహాత్మాగాంధీ గారికి ఈ విధానం అంగీకార యోగ్యంగా కనిపించ లేదు. కాని, పదిహేనుగురు కార్యనిర్వాహక సభ్యులలోనూ పదిమంది అటువైపే మొగ్గి, తన పక్షాన అయిదుగురు మాత్రమే ఉన్న పరిస్థితిని గమనించి, తన పట్టువిడిచి, రాజగోపాలాచారి మున్నగు తన పక్షీయులకు ఆశీర్వచనాలను అందజేస్తూ ప్రక్కకు తప్పుకున్నాడు.

పూనాసభలో నా జోస్యం

కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గసభ్యులు చాలామంది, వైస్రాయిగారూ, సెక్రటరీ ఆఫ్ స్టేటూ, లొంగి తీరతారనే నమ్మారు. కాని ఈ విషయంలో నా అనుమానాలు నాకు ఉన్నాయి. పూనా తీర్మానం ఆమోదించబడిన మర్నాడు, పూనా లా కాలేజీ స్టూడెంట్స్ సభలో నన్ను ఉపన్యసించ వలసిందని కోరిన పిలుపును పురస్కరించుకుని ఆ సభలో ఉపన్యసించాను. నా ఉపన్యాసంలో పూనా తీర్మానం ఒక పెద్ద పొర