పుట:Naajeevitayatrat021599mbp.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ సమయంలో బ్రిటనునుంచి మాకు కొన్ని వార్త లందాయి. బ్రిటిష్ కాబినెట్ వారు భారత రాజ్యాంగ చట్టాన్ని సవరించే హక్కును సంపాదించి, ఆ యుద్ధపు రోజులలోనే మన భారతదేశానికి బ్రిటిష్‌వారు చేయగలిగిన మంచి నంతటినీ చేయదలచుకున్నారనీ ఆ వార్తల సారాంశం. మేము, ప్రజల బాధ్యతలు నిర్వహించ వలసిన మంత్రులుగా ఆ ప్రతిపాదనలకు మా సమ్మతిని ఇవ్వజాలమని చెప్పాము.

ఈ విషయంలో కాంగ్రెసును గాని, కేంద్రశాసనసభ వారినిగాని ఆంగ్లేయులు సంప్రదించ లేదు. బ్రిటిష్ క్యాబినెట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ తీసుకున్న ఈ నిర్ణయానికీ, దేశాభిప్రాయానికీ విరుద్ధంగా వైస్రాయి ధనాన్నీ, జనాన్నీ పోగుచేస్తూన్న విధానానికీ నిరసనగా, కాంగ్రెసు అధిష్ఠానవర్గం పరిపాలనాయంత్రాన్ని చేబట్టిన వివిధ రాష్ట్రీయ కాంగ్రెసు మంత్రులతో నయినా సంప్రతించకుండా, రాజీనామాలు ఇవ్వడానికి సమయా సమయాలయినా ఆలోచించకుండా, ఒక్క మాటుగా - రాజ్యాంగాలను సాగిస్తూన్న ఏడు రాష్ట్రాల కాంగ్రెసు మంత్రులనూ, తదితరులనూ రాజీనామా లివ్వవలసిందని ఆదేశించింది.

కాంగ్రెసు మంత్రివర్గాల రాజీనామా

మే మందరం, మారు మాటాడకుండా, ఆ కాంగ్రెసు హైకమాండువారి ఆజ్ఞానుసారం, 1939 అక్టోబరు నెలాఖరుకు, రాజీనామాలిచ్చేశాం. దేశంలో ఉన్న పదకొండు రాష్ట్రాలలోను ఏడింట పరిపాలనా యంత్రాన్ని చేపట్టి ఉన్న కాంగ్రెసు వాదులందరూ ఒక్కసారిగా బయటకు వచ్చిన కారణంగా, బ్రిటిష్‌వారు వెంటనే కాళ్ళ బేరానికివచ్చి, భారతదేశంలో ఏదో ఒక విధంగా రాజీపడతారని తలచాం. కాంగ్రెసు హైకమాండు వారూ అటువంటి అభిప్రాయం తోనే మమ్మల్నందర్నీ ఒక్కుమ్మడిగా బయటకు రమ్మన్నారు. కాని నాకుమాత్రం ఏవో అనుమానా లుండిపోయాయి.

రాజీనామాలు జరిగిన వెంటనే వైస్రాయ్‌గారికీ, కాంగ్రెసువారికీ మధ్య సంప్రదింపు లారంభ మయ్యాయి. బ్రిటిష్‌వారు కూడా ఏదో కొంతవరకూ వంగి, లొంగి ఏదయినా అంగీకారానికి వద్దామనే యోచనలో