పుట:Naajeevitayatrat021599mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దాలు కలుగుతూ వచ్చాయి. ఇంతకాలం అయ్యాక నేను వాటికి కారణాలు వివరించడం కష్టం కాని, అప్పటికి నాటకాల వల్ల కలిగిన ప్రమాదాలు మాత్రం ఇవి.

ఈ కాలంలో నా విద్యార్థిదశని గురించి కూడా కొంచెం వ్రాస్తాను. నేను మొదటినించీ నిర్లక్ష్యంగా బ్రతికిన ఘటాన్ని! దానికి తోడు సర్వ స్వతంత్రులైన హనుమంతరావు నాయుడుగారి తయారీ. హనుమంతరావు నాయుడుగారు మంచి ఒడ్డూ పొడుగూ వున్న మనిషి. ఆయన బుగ్గమీసాలు మంచి భీకరంగా వుండేవి. చూడడానికే ఆయన గంభీరంగా ఉండేవారు. ఆయన తరగతుల్లో పాఠాలు చెబుతున్నప్పుడు కూడా స్వాతంత్ర్యం మహత్తర మైనదని చెబుతూ వుండేవారు. ఉదర పోషణ కోసం నౌఖరీలో వున్నా, వస్తుత: నౌఖరీ లంటే ఆయన కిష్టంలేదు. తన అనుచరుల్లో ఏమాత్రం స్వాతంత్ర్యపు పోకడలున్నా ఆయన ప్రోత్సహించేవారు. ఎందుచేతనో ఆయనకి నేను ఎన్ని గత్తర్లలో పడినా చివరకి తేల్తాననే ఒక నమ్మకమూ, దృఢవిశ్వాసమూ వుండేవి. కనక ఆయన నా వ్యవహారాలన్నీ చూసీచూడనట్టుగా వుండి, పైనించి, కంటికి రెప్పలా కనిపెడుతూ వుండేవారు. చదువులో కొంత శ్రద్ధగానే వుండేవాణ్ణి. కాకపోతే కొంచెం పొగరబోతుతనం అనేది వుండేది.

ఆ రోజుల్లో గోదావరికి ఈ కట్టలేదు. 'నేనూ మిత్రులూ కలిసి చాలావరకూ పగలల్లా గోదావరీగర్భంలో గడిపేవాళ్ళం' అంటే ఆశ్చర్యం ఏమీలేదు. సాధారణంగా రేవునిండా పడవలుండేవి. కాస్తవేసవి తిరిగేసరికి రేవుల్లో పడవలు ఏట్లోకి తోసుకుపోయి రాత్రిళ్ళు ఇసకతిప్పల్లో కాలక్షేపం చేస్తూ వుండేవాళ్ళము. ఒక లాంతరు పట్టుకుపోయి అక్కడే చదువుకునేవాళ్ళము. మాకు గోదావరిలో ఈతలాడడం నిత్యకార్యక్రమం. విద్యార్థి సంఘాలు స్థాపించి, చెడుగుడు, ఉప్పట్టి మొదలయిన ఆటలు ఆడేవాళ్ళము. రెండు పార్టీలుగా ఏర్పడి ఒక పార్టీతో ఇంకొకపార్టీ సవాల్ చేసి, మంచి పట్టుదలగా ఆడుకుంటూ