పుట:Naajeevitayatrat021599mbp.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధారంగా ఎట్టి చర్య తీసుకో దలచలేదనీ, తన పేర ఆమె వ్రాసే ట్రాన్సఫర్ దస్తావేజులో ఇంత సొమ్మని కూడా వ్రాయనవసరం లేదనే ఆయన అంటే, అల్లాకాదు - అంకె దానిలో వెయ్యాలని నే నన్నాను.

ఏది ఏమయినా, ఆమె హక్కులన్నీ సూర్యనారాయణరావుగారి పేర విలియా వేస్తే, తతిమ్మా వన్నీ తాము సరిచూసు కుంటామని ఆయన చెప్పడం చేతనూ, జరుగవలసిన కాండంతా అయిదు నిమిషాలలో జరగవలసి ఉన్న కారణంచేతనూ, ఆ కాగితంమీద, నాభార్యపేర, వారు కోరిన ప్రకారం ఎటువంటి ట్రాన్స్‌ఫర్ దస్తావేజయినా సరే ఇరవై వేలకు వ్రాసి ఇవ్వమని, ఒక ఉత్తరం గబగబా వ్రాసేశాను.

ప్రపంచకంలో ఎంతటి మూర్ఖుడయినా, ఇటువంటి తెలివి తక్కువ పని, అనాలోచితంగా, ఆ అయిదు నిమిషాలలోనూ చేసి ఉండడని నా తలంపు. ఏదయితేనేం - చేయకూడని పని చేశాను. చెయ్యి జారిపోయింది.

సూర్యనారాయణరావు నన్ను పూర్తిగా బోల్తా కొట్టించాడు. నా భార్యచేత ఆమెకున్న సర్వహక్కులూ తన పేర ట్రాన్సఫర్ వ్రాయించు కున్నాడు. ఇంత జేసినవాడు అప్పులయినా తీర్చాడా అంటే అదీ లేదు. పైగా, నా భార్య వ్రాసి ఇచ్చిన ట్రాన్సఫర్‌వల్ల తనకు రావలసిన అద్దె మాత్రమే తనకు లభిస్తుందనీ, అందువల్ల నా తాలూకు ఇతర బాకీలేవీ తాను తీర్చననీ స్పష్టంచేశాడు. కావా లంటే, 'స్వరాజ్య' కంపెనీ బాపతు చర, స్థిర ఆస్తులన్నీ - దానికోసం కొన్నస్థలం, ఉన్న బిల్డింగూ అన్నీ సాఫ్‌సీదాగా తనపేర పదివేల రూపాయలకు తనఖాపెడితే, నా తక్కిన బాకీలు తీరుస్తానన్నాడు.

తరవాత తనఖా దస్తావేజు

కృపానిధి మంచి చిక్కుల్లో పడ్డాడు. అతడే జెయిలులో నన్ను కలుసుకుని ఆ తనఖా దస్తావేజు ముసాయిదా నాచేత అంగీకరింప జెయ్యాలని నిర్ణయించ బడింది. ఆ మొదటి వ్యవహారంలో కృపానిధి చాలా తెలివి తక్కువగా వ్యవహరించి నన్ను ఒక శుంఠని జేశాడు.