పుట:Naajeevitayatrat021599mbp.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన 'స్వరాజ్య' పత్రిక ఆఫీసు ఇంటి యజమాని. పేరు కె. సూర్యనారాయణరావు.

ఏదో ఒక దుష్ట నక్షత్రాన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన ఇల్లు, నెలకు రూ 300 ల అద్దెమీద, మూడు సంవత్సరాలకు తీసుకున్నాను. ఆయన మా కంపెనీపై ఏదో కుట్ర చెయ్యాలన్న దురద్దేశంతో ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. బహుశ: ఆయనకు ఆరంభంనుంచీ అటువంటి ఉద్దేశం ఉండి ఉండదు. దర్మిలా, అనగా మొదటి మూడు సంవత్సరాల అగ్రిమెంటు కాలమూ ముగిసిన తరవాత ఆర్థికమైన మా ఇబ్బందులు ఆయన గ్రహించ గలిగిన కారణంగా ఎల్లాగయినా మా అచ్చాఫీసు కైంకర్యం చెయ్యాలన్న దుర్బుద్ధి ఆయనకు పుట్టి ఉంటుంది. ఎల్లాగయినా ఆయనకు రావలసిన అద్దె బాకీ క్రింద ఆ అచ్చాఫీసును స్వాహా చేయవచ్చునని ఆయన భావించి ఉంటాడు.

నేను 1932 లో అరెస్టయిన నాటికి ఏవో కొన్ని చిల్లర అప్పులూ, లినోటైపు కంపెనీకి ఇవ్వవలసిన బాకీలూ ఉండి పోయాయి. ఇంటి యజమానికి కూడా కొంత అద్దె బాకీ పడి ఉన్నాను. ఆయన కివ్వవలసిన బాకీతో సహా, ఇరవై వేల కంటె ఎక్కువగా ఉండి ఉండదు. మహా అయితే ఆ ఇరవై వేల అప్పూ ఒకటి రెండు లినోమిషన్ల ఖరీదుకంటె ఎక్కువ ఉండదు.

నాకు శిక్ష పడిన తరవాత, నా వ్యాపారమంతా చూస్తున్న కృపానిధి అన్న మా మేనేజరు ఏదో కొద్దిగ ఋణం కావలసి, ఆ ఇంటి యజమానిని కలుసుకున్నాడు. ఆ ఋణం పుట్టి నట్లయితే, కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు తీరతాయనీ, మళ్ళీ తిరిగి నేను వచ్చేవరకూ నిర్విఘ్నంగా పేపరు నడపవచ్చుననీ ఆయన తలచి ఉండవచ్చును.

సూ. నా. రావు తంత్రం

ఆ ఇంటి యజమానికి, తాను వాంఛించిన ప్రకారం, తనకు రావలసిన అద్దె బకాయి కింద ఆ అచ్చాఫీసంతా కైంకర్యం చేసేయాలన్న ఆశ ఎక్కువయి ఉంటుంది. అందుచేత, ఆయన తన సలహాదారులయిన పార్థసారథి, తిరువెంకటాచారిగార్ల సలహాకోసం వెళ్ళాడు.