పుట:Naajeevitayatrat021599mbp.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యనీ, పైల్ పద్దతిలోనూ, 'సి' క్లాసు వారిని చూసే విధంలోనూ మార్పులేదనీ, 'సి' క్లాసు వారిలో కొందరికి 'క్వారంటైన్‌' రాళ్ళు కొట్టే పనికూడా ఒప్పగించ బడిందనీ చెపితే చాలనుకుంటాను. నన్ను కొన్ని దినాలపాటు ఆనవాయితీ ప్రకారంగా 'క్వారంటైన్‌'లో ఉంచినప్పుడు ఈ విషయాలన్నీ నా కళ్ళతో చూసి గ్రహించ గలిగాను. ఈ సంగతులన్నీ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువచ్చిన కారణంగా నేను అక్కడ ఉన్నంతకాలం కొద్దిగా మార్పు కనబరిచారు. కాని నన్ను లోపలికి మార్చగానే, మామూలు కథే నడిచిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది.

ఈ అరెస్టును గురించీ, జెయిలు శిక్షను గురించీ మేము ఏ విధంగానూ ఎప్పుడూ అనుకుని ఉండలేదు. ఆ కారణంగా ఈ సంగతులన్నీ చాలా తొందర తొందరగా జరిగిపోయాయని అనుకోక తప్పదు. మేమూ - ఏ విధమయిన ప్రచారాలుగాని, సత్యాగ్రహ సమరాలుగాని జరపడంలేదు. గాంధీగారా - రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌నుంచి తిరిగి రానై ఉన్నారు. గాంధీగారు బొంబాయి రేవులో దిగిన తక్షణం ఆయన్నీ, ఆయనతో పాటే ఆసేతుశీతాచల పర్యంతం ఉన్న కాంగ్రెసు నాయకులనీ ఒక్కుమ్మడిని అరెస్టు చేస్తారని కలలోకూడా అనుకోలేదు.

13

'స్వరాజ్య' పత్రిక: చరమాధ్యాయం

'స్వరాజ్య' పత్రిక విషయంలో వచ్చిన చికాకులు ఋణదాతలతో చేసుకున్న ఒప్పందాలవల్ల, ప్రజలనుంచి నా కెప్పుడూ లభిస్తూ వచ్చిన సహకారాదులవల్ల చాలావరకు సద్దుకోగలిగాను. కాని మా సంస్థను చికాకుల పాలుచెయ్యాలన్న పట్టుదలతో ఒక పెద్ద మనిషి కొన్ని పనులు చేశాడు. ఆయన అవకాశం కోసం కాసుకు కూర్చున్నాడు.