పుట:Naajeevitayatrat021599mbp.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోనే వారెంట్ పుట్టిందని తలుస్తాను. నేను పట్నంలో ఉండగా నన్ను పట్టుకుంటే అనుకోని అలజడులు కలగవచ్చుననీ, అందులో మేము ప్రభుత్వ విరోధ చర్యలు ఏమీ నడవని సందర్భంలో అరెస్టు జరిగితే అలజడులూ, గడబిడలూ అదికమవుతాయనీ, ఏదో ఒక అబద్దపు ఛార్జీతో ఏ జిల్లాలోనయినా అరెస్టు చేస్తే కొంత గందరగోళం తగ్గుతుందనీ ప్రభుత్వంవారు తలచారు.

తప్పుడు కేసు

మర్నాటి ఉదయం నన్ను మేజస్ట్రేటుగారి ఎదుట హాజరుపెట్టేవరకూ, నా అరెస్టు కారణం తెలియదు. నా కేసు విచారణ జరగడానికి సాక్షులు కూడా హాజరులాగే ఉన్నారు. ఏలూరు నేషనల్ స్కూలు ఎదుట నేను నా కారులోనే నుంచుని ఒక బహిరంగ సభలో ఉపన్య సించానని ఆ సాక్ష్యంవల్ల నాకు తెలియ వచ్చింది. బహిరంగ సభ జరిగింది అన్నది దబ్బర. దానికి జనం హాజరయ్యా రన్నది అబద్ధం. సభ జరుగుతుందని ప్రకటన అయినా జరిగి ఉండలేదు. నేను కారులో బెజవాడ వెడుతూ అక్కడ ఆగిన సందర్భాన్ని పురస్కరించు కుని ఒక కథ అల్లారు.

నా కాలాన్నీ, కోర్టువారి కాలాన్ని వృథాపరచడం ఇష్టంలేక నేను ఏ విధమయిన క్రాసు పరీక్ష చెయ్యదలచుకోలేదు. నా తరపున డిఫెన్స్ సాక్ష్యాన్ని పెట్టి కేసు సాగించడమూ అనవసరం అనిపించింది. వారికి తోచిన రాజకీయ కారణాలతో నన్ను అరెస్టుజేసి జెయిలుకు పంపించాలని వారికి బుద్ధి పుట్టింది. "ప్రభుత్వంవారు కోరినప్పుడల్లా జెయిళ్ళకు వెళ్ళడానికి మేము సర్వదా సిద్ధంగానే ఉంటున్నాము గదా! అలాంటప్పుడు ఈ తప్పుడు కేసు మాత్రం ఎందుకు?" అని మాత్రం కోర్టులో అంటూ, "ఎందుకింకా ఆలస్యం? మీరు తలచినంత కాలం త్వరగా శిక్ష విధించండి" అన్నాను. ఆయన నాకు ఎనిమిది మాసాలు విధించాడు.

లండన్‌లో రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ విఫలం అవడంతోనే