పుట:Naajeevitayatrat021599mbp.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓడ దిగకుండానే అరెస్టు కావడం జరిగింది. అన్ని ప్రాంతాల నాయకులూ నిర్భంధించబడడం జరిగింది.

ఆ పరిస్థితులలో 1932 లో నేనూ తిరిగి అరెస్టు అయ్యాను. సర్ శామ్యూల్ హోర్ భారత దేశంలో మళ్ళీ ఏ విధమయిన ఆరాటాలూ, కలతలూ రేగకుండా తగు చర్య తీసుకో వలసిందని ఇచ్చిన సలహా ప్రకారమే ఈ అరెస్టులన్నీ సాగిస్తున్నామని ప్రభుత్వం వారు బాహాటంగా ఒప్పుకోలేకపోయారు. అలాంటి సూచనలూ, సలహాలూ అందిన కారణంగానే నిజానిజాలతో నిమిత్తంలేకుండా, ఒక్కొక్కరి అరెస్టుకూ కారణం చూపాలి గనుక, ఏదో ఒకటి చూపించారు. నా అరెస్టుకు కూడా అటువంటి విపరీత కారణమే చూపబడింది.

అరెస్టుకు కారణాలు

నేను అప్పుడు రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగానే ఉంటూ ఉండేవాడిని. ఏలూరులో మేము రాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగు పెట్టుకున్నాము. ఆ మీటింగు కొన్నాళ్ళపాటు నడిచింది. పెంచబడిన రీసెటిల్మెంట్ రేట్ల విషయంలో కొన్ని ముఖ్య విషయాలు తర్జన భర్జన చేస్తున్నాము. 1930 లో మేము నడపిన శాసన ధిక్కారాన్నీ, నన్నూ నాతోటి వర్కర్లని ఆ సంవత్సరం ఉప్పు సత్యాగ్రహ సంబంధంగా అరెస్టుచేసిన సందర్భాన్ని పురస్కరించుకునీ, ప్రభుత్వంవారు ఎక్కువ చేయబడిన ఆ రీసెటిల్మెంట్ పన్నులను వసూలు చేయడానికి పూనుకున్నారు.

మేము జెయిళ్ళనుంచి తిరిగివచ్చాక, 1931 లో ఆ విషయమై ఏం జేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఒకప్రక్క రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్ నడుస్తూండడంచేత దాని పర్యవసానం ఎల్లా ఉంటుందో తెలియదు కనుక, ప్రభుత్వం ఆ పన్నుల వసూలు సందర్భంలో నిర్భంధ విధానాలను ప్రవేశపెట్టలేదు. ఆ కాన్ఫరెన్స్ విఫలం అయిన కారణంగా అరెస్టు వారెంట్ మాత్రం పంపించారు.

ప్రభుత్వంవారు జారీచేసిన ఆర్డరు పురస్కరించుకుని నేను చెన్నపట్నం వెళ్ళకుండా నా ప్రయాణాన్ని ఆపుజెయ్యాలనే ఉద్దేశం