పుట:Naajeevitayatrat021599mbp.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండేది. మేము ఆమెతో కలిసి 'హోం రూలు' సంరంభంలో పనిచేసిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఉపన్యాసాల ద్వారానూ, వార్తా పత్రికల ద్వారానూ ఎంతగా ప్రయత్నించి తంటాలుపడ్డా, ఆమెను మాంటేగ్ ముందర దిగజారి పోతూన్న పరిస్థితినుంచి ఆనాడు తప్పించలేకపోయాం. ఆమె మొదటిసారిగా మాంటేగ్‌ను దర్శించి నప్పుడు, ఆయన నిశ్చల, నిర్మల, శాంతియుత వాతావరణంలో తన విచారణ జరపగల అవకాశం కలుగజేయమని కోరిన కోర్కెను మన్నించిన కారణంగానే, ఆమె అంత హఠాత్తుగా దిగజారిపోయిందని మాలో కొందరికి అనుమానం కలిగింది.

సప్రూ - జయకర్ రాయబారాలు

1930 నాటి రాజీ ప్రయత్నాలు మహాత్మాగాంధీతో సహా అన్నివర్గాల కాంగ్రెసు నాయకులూ జెయిళ్లల్లో ఉన్న సమయంలో ఆరంభించబడ్డాయి. ఆ ఉద్యమ సమయంలో చాలాకాలం మోతీలాల్‌ నెహ్రూగారు బయటే ఉన్నారు. ఆ నాడు ఆ రాజీప్రతిపాదనలు సర్ తేజ్ బహదూర్ సప్రూ, జయకర్‌గార్ల నాయకత్వాన నడిచాయి. ఆనాటి ఉద్యమం మాంచి రసకందాయ పట్టుగానే నడిచింది. బ్రిటిష్ రాజకీయ వేత్తలూ, ప్రభుత్వం వారూ కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదని మెల్లి మెల్లిగా గ్రహిస్తున్నారు.

ఆంగ్లరాజకీయవేత్తలు సందర్భానుసారంగా మార్గావ్వేషణచేసి జాగ్రత్తపడగల నేర్పరులు. వారు భారత నాయకుల మనోభావాలు గత 20 సంవత్సరాలుగా పూర్తిగా శోధించి గ్రహించి ఉన్నారు. ఈ సారి భారతీయుల దృష్టి ప్రక్కత్రోవల పట్టించాలనే కోరికతో, రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్ అనే నూతన పంధాను చేబట్టారు.

మొదటి రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్ 1930 నవంబరులో జరుగవలసి ఉంది. ఆ కాన్ఫరెన్స్ జరిగేలోపల సప్రూ - జయకర్ గార్లు ఎల్లాగయినా గాంధీగారినీ, నెహ్రూ ద్వయాన్నీ ప్రభుత్వం వారి అనుమతితో కలుసుకుని సంప్రతించాలని ప్రయత్నించారు కాన్ఫరెన్స్‌కి