పుట:Naajeevitayatrat021599mbp.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ప్రొవిన్షియల్ ఆటోనమీ' సూచనకైనా నోచుకోని పరిస్థితికి పడిపోయిన ఉదంతమూ, అందుకు కారణాలూ ఎన్నిసార్లు చెప్పినా, నాకు చెప్పాలనిపిస్తుంది. ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు బాధ వచ్చి, "ఆంగ్లేయులు శక్తిహీనులయిన శత్రువులను చూసి జాలి పొందరు. కాదా అంటే నెత్తికెక్కుతారు" అన్నది మళ్ళీ మళ్ళీ మనవి చెయ్యకుండా ఉండలేను. వారు మనలను అధ:పాతాళానికి అణగద్రొక్కాలనే ఉద్దేశంతోనే, కత్తి చేతబట్టి సంపాదించిన రాజ్యాన్ని కత్తి చేతబట్టే పరిపాలిస్తాం అని అన్నారనీ, వారు అలాఅనగలగడానికి కారణం మన నాయకులూ, వారి చేతలూ, వ్రాతలూ, పలుకులూ కల్పించిన మన దుస్థితేనని మళ్ళీ ఒకసారి మనవి చేసి, నా మన:క్లేశాన్ని మరి కాస్త తగ్గించుకోడానికి ప్రయత్నిస్తాను. కాగా, దున్న పోతునీ దూడనీ ఒకే కాడికి కట్టిన విధంగా, మన దేశంలో ఉన్న రాజుల ప్రసక్తికీ, రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ విధానాలకీ కూడా పనిలో పనిగా ముడిపెట్టగలిగిందా కమిషన్. దీని కంతటికి కారణం మన పిరికితనమేనని తిరిగి వక్కాణించి నా ఆవేదన తీర్చుకోనివ్వండి.

ఆ యువక ద్వయం - సుభాష్‌బాబూ, జవహర్‌బాబూ, ఇటువంటి పతనం ఏదో రాబోతోందని గ్రహించే, కలకత్తా కాంగ్రెస్‌లో విషయ నిర్ధారణ సభ వారు అంగీకరించిన ప్రతిపాదనకు బహిరంగ సమావేశంలో అడ్డు తగిలి, తమ సవరణ ప్రతిపాదించారు. అనుకున్న దానిని కాదంటున్నారని గాంధీగారు అడ్డు తగలడం చేతనే, ఆ సవరణ వీగిపోయింది. ఈ సందర్భంలో కూడా భారతీయ నాయకులు తమ బలహీనతనే తిరిగీ ప్రదర్శించుకున్నారు. దేశక్షేమాన్ని విస్మరించారు. మోతీలాల్ నిరంకుశులలో నిరంకుశుడు. ఆయనకు తిరిగీ మహాత్ముని అండ దొరకగానే, శాంతంగా మంచి చెడ్డలు విచారించడం న్యాయమేమో అన్న దృష్టే సన్నగిల్లింది. ఆ అత్యవసర పరిస్థితులలో ఆయన ధీశక్తిని ఉత్తేజపరచి, ఆ రాజీ ప్రతిపాదనలకు వ్యతిరిక్తత ఆయనలో కలిగించలేకపోయాము.

1918 - 19 సంవత్సరాలలో అనిబిసెంటమ్మ పరిస్థితీ అల్లాగే