పుట:Naajeevitayatrat021599mbp.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపొందిస్తూ త్వరలోనే ప్రకటన చేస్తామనీ చెప్పిన కారణంగా, వారికి కృతజ్ఞతలు తెలుపుడు చేయాలనీ, డొమినియన్ స్టేటస్ రూపొందించే లోపల, కాంగ్రెస్ - లీగ్ పథకం భారతదేశానికి స్వయంపరిపాలన కలుగజేస్తామన్న ఈ శుభ సమయంలో వెంటనే అమలు పరచాలనీ కోరారు. ఇంతా జరిగాక, తీరా మాంటేగ్ వచ్చి స్వయంగా సంగతి సందర్భాలు విచారిస్తున్న సమయంలో, డా॥ అనిబిసెంట్ దేశం కోరుతూన్న కోర్కెలను వివరిస్తూ, సర్ శంకరన్ నాయరు అభిప్రాయమే తన అభిప్రాయం అంది.

సర్ శంకరన్ నాయర్ కాలానుగుణంగా నడవగల మనిషి కాడన్న విషయం లోక విదితమే. ఆయన 1897 లో కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ తరవాత మైలాపూరు మిత్రులతో కలిసి ఉద్యోగాది హోదాల మీదికి దృష్టి మళ్ళించుకున్నాడు. అక్కడ ఆ మైలాపూరు యోధులు ఈయన్ని దిగద్రొక్కి పైకి వెళ్ళిపోయారు. 1907 లో ఆయన మదరాసు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది గానూ, పబ్లిక్ ప్రాసిక్యూటరుగానూ ఉండేవాడు. నాతోబాటు ఆయన లండన్ నగరంలోని గ్రేస్ ఇన్ (Gray's Inn) ద్వారా బారిష్టరు పరీక్షకు హాజరయ్యాడన్న సంగతి ఇదివరలోనే చెప్పి ఉన్నాను. ఆయన 1917 - 18 లో గాని జడ్జీ కాలేదు.

ఆయన స్వాభావికంగా మితవాది. 1918 లో కాంగ్రెసును బలపరచడానికి సర్ శంకరన్ నాయర్‌కి ఏయే కారణాలున్నయో మనకు తెలియదుగాని, డా॥ అనిబిసెంట్ మాత్రం శంకరన్ నాయర్‌ని గురించి మాంటేగ్‌తో చెప్పడమూ, ఆ శంకరన్ నాయర్ అభిప్రాయమే తన అభిప్రాయమని సూచించడమూ మాత్రం క్షమార్హం కాదు.

ఆ ముక్కలలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె తన వాంఛితార్థమూ, కాంగ్రెస్ తీర్మాన రూపకంగా కోరిన కోరికా, మాంటేగ్‌తో నొక్కి వక్కాణించి ఉండవలసింది. అంతేకాదు, కీ. శే. ఎస్. శ్రీనివాసయ్యంగారు మాంటేగ్‌తో చెప్పిన విషయాలు మనం గ్రహించాలి.