పుట:Naajeevitayatrat021599mbp.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవసరమయిన సలహాలు, సూచనలూ ఇవ్వడానికి మా కెవ్వరికీ ఖైదు కారణంగా హక్కు లేకుండా పోయింది. అందువల్ల సాధారణకాంగ్రెస్ సభ్యునిగా గాని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మెంబరుగా గాని నేనేమీ సలహా ఇవ్వగల స్థితిలో లేను.

ముందుగా ఏ లీడర్నీ వదలని కారణంగా రాజీ జరగడానికి ఎల్లా సాధ్యం అవుతుందనే అనుమానం నన్ను పీడిస్తూనే ఉంది. కాని చాలామంది యువకులూ, కొంతమంది పెద్దలూ కూడా అన్యధా తలచి, నేను అనుమానం సూచిస్తూంటే నామీద విరుచుకు పడేవారు. అల్లా ఆ జూలై - ఆగస్టు మాసాలు రెండూ ఆశాపూరితంగానే వెళ్ళిపోయాయి. అనుకోని విధంగా, ఎంతో ముందుగా ఈ యుద్ధ కాండంతా ఎంతో విజయవంతంగా ముగుస్తోందని మా వాళ్ళంతా కేరింతలు కొడుతూ చాలా ఉల్లాసంగా తయారయ్యారు. వార్తాపత్రికలలోని గడబిడ తప్ప, మధ్యవర్తి ప్రయత్నాలను గురించీ, జెయిళ్ళల్లో ఉన్న నాయకులు ఖైదీలుగానే ఉంటూ ఉన్నా వారిలో వారు కలుసుకుని సంప్రతించుకోవడానికి అవకాశాలు కలుగజేయబడ్డాయని కానీ, స్పష్టంగానూ, సవ్యంగాను, ఆ జూలై - ఆగస్టు మాసాలలో గాని, దర్మిలాగాని ఎలాంటి సమాచారమూ, సరిగా గ్రాహ్యం అయ్యేరీతిని, ఏ మూలనుంచీ అందలేదు. రాజీ ప్రయత్నాలు విఫలం అన్న వార్తయినా ఎక్కడా పొక్కలేదు.

వట్టి పేపరు వార్తలు

గవర్నమెంటువారు రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పకపోవడానికి అనేక కారణా లున్నాయి. మీరు కలుగజేసుకుని రాజీ ప్రయత్నాలు జరపడంగాని, ఫలాని విధంగా ఫలానా ఫలానా సూచనలు గాంధీగారితోనో, నెహ్రూ ద్వయంతోనో చేయవల సిందనిగాని ప్రభుత్వంవారు ఎప్పుడూ ఏ మధ్యవర్తికీ సూచించి ఉండలేదు. ప్రభుత్వం వారికి సంబంధించి నంతవరకూ అసలు ప్రతిపాదనలూ జరగలేదు, ప్రయత్నాలు విఫలమూ కాలేదు. అందువల్ల ఎలాంటి ప్రకటనా చేయవలసిన బాధ్యతా ప్రభుత్వం వారిమీద లేదు. భారతదేశమందలి కాంగ్రెసు నాయకులూ, దేశం అన్నిమూలలా ఉన్న జెయిళ్ళలో మ్రగ్గు