పుట:Naajeevitayatrat021599mbp.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా ఊహాగానాలు

ఇల్లా ఏదో పుకారుగా ఒక వార్త పేపర్లో వచ్చేసరికి, ఆ వార్త అధికార పూర్వక వార్తగానే నమ్మి, ఊహాగానాలు చేశాం. ఆ రాజీ విషయాలన్నీ ముందు ముందు వ్రాస్తాను. ఏ ప్రకారంగా నాయకులను తప్పుదారి త్రొక్కించారో, ఏ కారణంగా ఆ రాజీ ప్రయత్నాలు విఫలం అయ్యాయో, సప్రూ - జయకరుగార్లూ, కాంగ్రెసు నాయకులు కూడా ఏ విధంగా పప్పులో కాలేశారో అన్నీ వివరిస్తాను. ఈ లోపల కన్ననూరు జెయిలులో ఉన్న మేము రాజీ ప్రతిపాదనలు జరుగుతున్నాయి, రాజీ కూడా కనుచూపుమేర దూరంలోకి వచ్చింది అని అనుకుంటూ, ఆ జూలై - ఆగస్టు మాసాలు ఉత్సాహంగా గడిపాం.

ఆ నాటి పరిస్థితి అత్యంత ఆశాజనకంగా ఉండడానికి కారణం, తండ్రీ కొడుకులయిన ఆ నెహ్రూ ద్వయమూ, డా॥ సయ్యద్ మహమ్మదూ, కార్యనిర్వాహక సభ్యులు ఒకరిద్దరూ, ఉత్తర ప్రదేశంలో ఉన్న నైనిటాల్ జెయిలునుంచి గాంధీగారిని కలుసుకోడానికిగాను ఎరవాడా జెయిలుకు తీసుకురాబడ్డారన్న వార్త. ఇదంతా ఒకపక్కనుంచే వస్తూన్న సమాచారం అని మాకు తెలియదు. కాంగ్రెసు నాయకుల నోటంట వారి కోర్కెలు రాబట్టాలని చేసిన తంత్రమేమో గాని, వారందరూ కలిసికట్టుగా ఆలోచించిన మీదట, ఒకే అభిప్రాయానికి రావడానికి వారికి ఏ విధమయిన సావకాశమూ కల్పించబడలేదు. కాని వారి వారి అభిప్రాయాలు యిలా యిలా ఉన్నాయనిమాత్రం వైస్రాయిగారికి వార్తలు చేరేశారు.

బెల్లంకొట్టిన వైస్రాయి

అంతవరకూ వైస్రాయ్‌గారు బెల్లంకొట్టిన రాయిలా, శబ్దరహితంగా, ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నాడు. అంతేకాదు, తాను ఏవయినా సూచనలు చేసి ఉంటే, వాటిని వెనక్కు లాక్కుని కాంగ్రెస్ వారిని చికాకులపాలు చెయ్యడానికి సిద్దం అవడానికి కావలసిన పన్నుగడలూ, సన్నాహాలూ చేస్తూ వచ్చాడు. నిజానిజాలు తెలుసుకుని,