పుట:Naajeevitayatrat021599mbp.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారణాలవల్ల భారతదేశాన్ని వదులుకోవడానికి అనిష్టత చూపుతున్నారో మాత్రం క్షుణ్ణంగా అర్థమయి తీరుతుంది.

కన్ననూరు జెయిలుకు బదిలీ

హఠాత్తుగా ఒకనాటి ఉదయాన్ని, నన్ను కన్ననూరు జైలుకు మార్చనున్నారనీ, ఆ సాయంత్రమే నేను బయల్దేరవలసి ఉంటుందని చెప్పారు. ఏ కారణం వల్ల ఈ మార్పు చేస్తున్నారో నాకు వారు చెప్పలేదు. నాకూ తెలియదు. ఎంత ఆలోచించినా, క్రమశిక్షాణాది విషయాలకు నేను ఎప్పుడూ భంగం కలిగించలేదనీ, ఎటొచ్చీ 'సి' క్లాసు ఖైదీలను గురించి మాత్రం తరుచు సూపరింటెండెంట్‌తో వాదించే వాడిననీ, ఆ వాదన తీరూ, ధోరణీ నేను అనుకోని విధంగా సూపరింటెండెంట్‌ను చికాకు పరచాయేమోననీ భావించాను. నేను నిశ్చయంగానూ, నమ్మకంగానూ భావిస్తూన్న విధానాల ప్రకారం, రాజకీయ ఖైదీలు సామాన్య ఖైదీలవలె చూడబడకూడదన్నదే నా వాదం. రాజకీయ ఖైదీలుగా 'ఎ', 'బి', 'సి' క్లాసులలో ఏ క్లాసుకు చెంది ఉన్నా, మేమంతా అహింసాత్మక విధానంగా దేశ స్వాతంత్ర్యంకోసం పెనగులాడుతూన్న రాజకీయ ఖైదీలమే అవడాన్ని మా విషయంలో తగు విచక్షణతో ఆ జెయిలు అధికార్లు మెలగవలసి ఉంటుందన్నదే నా పట్టు. ఎంత ప్రయత్నించినా నాకు నమ్రత, అణకువ అన్నవి. అలవాటు కాలేదు సరికదా - తలవంపు, చిన్నతనమూ అన్నవి పీడిస్తూనే ఉండేవి. బహుశ: అందువల్ల నా మామూలు నడతా, నా ప్రవర్తనా ఆ సూపరింటెండెంట్ గారికి నాపై విరుద్ద భావ మేర్పడడానికి కారణమయి ఉండవచ్చును.

కాగా ఇప్పటికి మరపురాని ఇంకో చిన్న సంఘటన ఒకటుంది. ఒకనాడు నాకు సూపరింటెండెంటుగారి వద్దనుంచి కబురు వచ్చింది. నేను వెళ్ళేసరికి ఆయన ఒక బురుజులో ఆసీనులయి ఉన్నారు. నేను వెళ్ళి, ఆచార ప్రకారం ఆయనకు నమస్కరించాను. నన్ను కూర్చోమని అనకుండా ఆయన అలా నిలబెట్టేసే ఉంచాడు. న్యాయానికి ఖైదీలుగా మా కలాంటి మర్యాదలు (బహుశ:) చేయరు. చేయకూడదు. కాని