పుట:Naajeevitayatrat021599mbp.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కీయ ఖైదీలుగా మా కిచ్చే ఆహారానికి, మామూలు 'సి' క్లాసు ఖైదీల ఆహారానికీ తేడాయే లేదు అదే, ఆ మామూలు 'సి' క్లాసు నేరస్తులకిచ్చే ఆహారమే, అక్కడ వంటశాలలోనే తయారుచేసి, మాకు వడ్డింపించేవారు. ఈ పరిస్థితి చాలాకాలమే సాగిందిగాని, తరవాత తరవాత 'ఏ", 'బి' తరగతి ఖైదీలకు వేరే వంటశాలలు ఏర్పరచి, వాటిని నడుపుకునే అధికారంకూడా వారికే హస్తగతం జేశారు. ఈ పద్ధతి ముందుగా 'ఏ', 'బి' క్లాసు ఖైదీలకు మాత్రమే లభింపజేసి ఉన్నా, ఆ వెల్లూరు జెయిలు అధికారులు క్రమేపీ అటువంటి పరిశుభ్ర మయిన భోజనం 'సి' క్లాసు రాజకీయ ఖైదీలకి కూడా లభింపజేశారు. ఆ వంటశాల జెయిలు ఆవరణలో లోపలి ముఖద్వారానికి చేరి రోడ్డుమీదకే ఉన్న ఒక ఇంటిలో ఉండేది.

పెనిటెంషరీలో - 'మిష్టర్ హో'తో

మొట్టమొదటి సారిగా నన్ను మదరాసు పెనిటెంషరీలో నిర్భందించారు. నాకు వేడివలన పుట్టిన ఆ కురుపులు తగ్గేవరకూ ఆ పెనిటెంషరీలోని ఆస్పత్రి బ్లాకులోనే ఉంచారు. ఎండా కాలంలో ఇంటిపట్టున నీడలోనే నివసించే వారికి వేసే మామూలు ఎండతాపపు కురుపులు కాదు నాకు లేచినవి. పదిహేనురోజులపాటు విధీ విరామం లేకుండా కాలినడకను నగర వీధులన్నింటినీ చుట్టితిరిగే సందర్భంలో కలిగిన శరీర తాపంవల్ల వచ్చిన కురుపులవి. ఆ ఉత్సాహంలో నాకు నా శరీరంలో ఏదోలా ఉంటూందన్న సంగతి జెయిలుకు వెళ్ళిందాకా తెలియనే తెలియదు. అనుదినమూ ఎండలో ఎన్నో మైళ్ళు నడవందే సముద్రతీరానికి జేరుకోలేక పోయేవాళ్ళం. అల్లా రోజు కొక్కతావుగా, అడయారు, మైలాపూరులో ఇన్‌స్పెక్టర్ జనరల్ గారి ఆఫీసు ఎదుట ఇసుకలో, తిరువళిక్కేని బీచిని, హైకోర్టు బీచిని, రాయపురంలో రోజూ ఒక కొత్త తావుకుజేరి ఉప్పు తయారు చేస్తూ, అనుదినమూ ఒక కొత్త అనుభవాన్ని సంపాదించాం. కాని నాకు ఈ తిరుగుళ్ళ అనంతరం జెయిల్లో కాస్త విశ్రాంతి శరీరానికి లభించేసరికి వేడి పైకి తన్ని