పుట:Naajeevitayatrat021599mbp.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహంలో ఎవరెవరు పాల్గొంటున్నారో ముందుగా ప్రభుత్వం వారికీ తెలిపే వారం. ఊరేగింపుగా బయల్దేరి ముఖ్యమయిన వీథులగుండా సాగి వివిధ ప్రాంతాలనుంచి సముద్రపు టొడ్డుకు జేరి, ఆ సముద్రపు నీటితో ఉప్పు జేసేవారు. ఇది ఒక అద్వితీయమైన సంరంభం. ఇదియే ఏ విధంగా పరిణమిస్తుందో, ఏ అంతస్తులను అందుకుంటుందో ప్రభుత్వం వారికి అవగాహన కాని కారణంగా, పదిహేను దినాలపాటు ఏ విధమయిన ఉపద్రవమూ లేకుండా వాలంటీర్లు పురవీథుల గుండా ఊరేగడమూ వగైరా కార్యక్రమాలన్నీ యథాతథంగా అల్లా అల్లా సాగిపోయాయి.

ఈ పదిహేను రోజులపాటూ నేనూ, నాగేశ్వరరావుగారూ ప్రతి దినమూ ఆనాటి జట్టుతో ఊరేగుతూనే ఉన్నాము. క్రమ శిక్షణతో కూడిన కవాతు, డ్రిల్లు వగైరాలకు అలవాటుపడిన సిపాయిల జట్టువలెనే ఉండేది మా జట్టు నడిచే క్రమమూ అదీను. మా వాళ్ళూ మార్చింగ్ సాంగ్స్ పాడేవారు. ఆ పాటలలో ప్రభుత్వం వారిని సవాలు జేసేవారు. ఉప్పు చట్టాన్ని ఊడ బెరుక దలచాం కాబట్టి, మీరు చేయగలిగింది ఏమయినా ఉంటే చూసుకోండి అనే హెచ్చరికగా ఆ పాటలుండేవి.

ఉదయవనం క్యాంపులో జేరిన వాలంటీర్లలో ప్రజ్ఞావంతులయిన యువకులుండేవారు. వారు తమ కార్యక్రమం పరిసర ప్రాంతాలకీ, గ్రామగ్రామాలకీ కూడా విస్తరింపజేశారు. కొంతమంది సముద్ర జలాలను పల్లపు ప్రాంతాలకు మళ్ళించడానికి వీలుగా భూమిని దున్ని, కాలువ లేర్పాటుజేసి, నీళ్ళు మళ్ళించి, ఉప్పు మళ్ళు ఏర్పరచేవారు. మార్చిల వలనా, అనుదినం ఉండే బహిరంగ సభల వలనా ఈ ఉద్యమం ఆ 15 రోజులలోనూ శుక్లపక్ష చంద్రబింబంగా దినదినాభివృద్ధి జెందింది. పూర్ణత్వాన్ని పొంద గలిగింది. ఒక వారం పది రోజులయ్యే సరికి ప్రభుత్వం వారికి కాస్త వేడెక్కిందిగాని, ఈ ఉద్యమాన్ని అణచడానికి ఏం చెయ్యాలి, ఎక్కడ ఏ తీరున ఆరంభించాలి అన్న ఆలోచన తెగలేదు.

దుర్గాభాయి సన్నద్ధత

రెండవ బహిరంగ సభ కూడా ఆ కోట పరిసరాలలోనే, కోటకు ఎదుట ఉన్న బీచీలోనే ఏర్పరుపబడింది. దానిలోనూ నేనే మాట్లాడాను.