పుట:Naajeevitayatrat021599mbp.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్దదయింది. గుంటూరులోని మిత్రులతో సంభాషించిన తర్వాత నేను చెన్నపట్నం వెళ్ళిపోయాను.

మదరాసు పౌరుల ఉత్సాహం

చెన్నపట్నంలో జరిగిన మొట్టమొదటి సత్యాగ్రహ సభ కోటకు ఎదురుగా ఉన్న విశాల మైదానంలో జరిగింది. ఆ మీటింగు నాటికే ఉదయవనం క్యాంపు పూర్తిగా నిండిపోయింది. పట్నంనుంచీ, పరిసర ప్రాంతాలనుంచేగాక, ఆంధ్ర, తమిళ, మలయాళదేశాలనుంచి వచ్చిన వారందరితోటీ ఆ క్యాంపు నిండిపోయింది. వాలంటీర్లు వచ్చింది ఆ రాష్ట్రం నుంచా, ఈ రాష్ట్రనుంచా అన్న ప్రసక్తే మాకు కలుగలేదు. ఆ పట్నం రాష్ట్ర మొత్తానికి ముఖ్యపట్టణం అవడాన్ని, రాష్ట్రమందలి అన్ని ప్రాంతాలవారికి మార్గం చూపడమే మా పని అని మేము భావించాం. వాలంటీర్లను పది పదిహేను మందిగల బాచిలుగా విభాగించి, రోజూ ఒక బాచీవారు, ఆ పురవీధులగుండా తిరగవలసి ఉంటుందని నిర్ధారణ జేశాం. అందు మొదటి బాచ్ పదిహేనుమంది ఏ యే రస్తాలద్వారా ఊరేగాలో కూడా నిర్ణయించాము.

మొదటి బాచ్ యింకా రెండు రోజులలో బయల్దేరుతుందనగా, మొట్టమొదటి బహిరంగ సభ ఏర్పాటయింది. ఇంకా నేను కాంగ్రెసు వారి ఆశయమూ, వారు చేయదలచిన పని వివరంగా చెప్పకుండానే కె. భాష్యమూ, బషీర్ అహమ్మద్ అనే ఇరువురు అడ్వకేట్లు నా కంటె ముందుగా ప్రజాసమూహానికి తమ ఉపన్యాసం వినిపించాలని ఉన్నదని, ముందుగా వారిని మాటాడనియ్యవలసిందనీ కోరారు. వారు ఉభయులూ కూడా నన్ను బాగా ఎరిగినవారే. కాని నన్నూ, అక్కడ జేరిన ప్రజానీకాన్ని పట్నంలో కావలసిన వాతావరణం లేదని ఒప్పించాలని వారి ఉపన్యాసంలో వివరించారు. అంతేకాదు, అక్కడ మేము శాసన ధిక్కారం చేయబూనడమూ, ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించాలని తలచడమూ వృథా శ్రమ అనీ, అందువలన ఆ పట్నంలో అటువంటి ప్రయాత్నాలేవీ చేయవద్దనీ నన్ను కోరారు.