పుట:Naajeevitayatrat021599mbp.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నికి వారు ఏ విధానాలు అవలంబించ నున్నారో తెలుసుకున్నారు. నేను పట్నం చేరేసరికి వారు జిల్లాలలో పర్యటిస్తున్నారు.

నేను కృష్ణా, గుంటూరు జిల్లాలలో పర్యటించాను. బందరులో కృష్ణాజిల్లా అన్ని తాలూకాలనుంచి వచ్చి పాల్గొనే వాలంటీర్ల విడుదల కోసమూ, వారికి చేయవలసిన భోజనాది సదుపాయాల కోసమూ బ్రహ్మాండమయిన ఏర్పాట్లు జరిగాయి. మా విజయాన్ని గురించి నాకు నమ్మకం మరింత దృడమయింది.

బందరులో ఉప్పు పొట్లాల అమ్మకం

బందరులో ఉన్న పరిస్థితులు గమనిస్తూన్న సందర్భంలో అప్పుడే అక్కడ సత్యాగ్రహ సమరం ఆరంభం అయిందని గ్రహించాను. వాలంటీర్లు తయారుచేసిన చిన్న చిన్న ఉప్పుపొట్లాలు బహిరంగ సభలలో అమ్మడం జరిగింది. జరుగుతూన్న సమర విధానంలో పోలీసులు ఏమీ కలుగజేసుకోవడం లేదు. అక్కడ సముద్రతీరంలో కొన్ని పల్లపు ప్రాంతాలలో సముద్రపునీరు కెరటాలుగా వచ్చి ఎండ వేడిమికి ఎండి ఉప్పు బిళ్ళలు బిళ్ళలుగా అ నీటిపై అచ్చు కడుతోందని, అదే ప్రకారం ఎండ తాపానికి తయారయ్యే ఉప్పుగల్లులు ఏరడానికే గాంధీగారు 'దండీ'కి బయల్దేరారనీ గ్రహించాను.

పోలీసులు ఏవిధమయిన చర్య తీసుకోని కారణంగా నేను కొంతమంది మిత్రులతో కలిసి, కారులో ఆ ప్రాంతాలకు వెళ్ళి, అచ్చట స్వభావ సిద్ధంగా తయారవుతూన్న ఉప్పు గల్లులను పెద్ద ఎత్తున పోగుజేశాను. నేను నాలుగైదు వేలు జేసే నాయుడిగారి సొంతకారులో బయల్దేరాను. నాతో కొంతమంది వర్కర్లున్నారు. వారిలో బోంబే క్రానికల్ పత్రికలో పనిచేస్తూన్న కీ॥ శే॥ సుబ్బారావుకూడా ఉన్నాడు. అ భూములు ఊరికి నాలుగైదు మైళ్ల దూరంలో ఉన్నాయి. దారి పొడుగునా వాలంటీర్ల క్యాంప్‌లు ఉన్నాయి. కొంతమంది వాలంటీర్లు మా కారును వెంబడించారు. అక్కడ సుమారు వెయ్యిమంది వాలంటీర్లు ఈ ఉప్పుగల్లులను ఏరుతున్నారు.