పుట:Naajeevitayatrat021599mbp.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిజిల్లాలోనూ లీడర్లకూ, వర్కర్లకూ ఎప్పుడూ లోటులేదు. సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభించిన నాటినుంచీ ఆంధ్ర రాష్ట్రంలో నాయకులకి ఎప్పుడూ కొరత రాలేదు. అప్పటి కప్పుడే గడచిన, ఏడు సంవత్సరాలుగా మేమంతా నీళ్లల్లో కయినా, నిప్పులలో కయినా సరే, దూకడానికి సిద్దమయ్యే ఉన్నాం. కాంగ్రెసు కమిటీలుగాని, కాంగ్రెసు వర్కర్లుగాని సవ్యంగా పనిచేస్తున్నారా - లేదా అన్న విచారం నా కెప్పుడూ లేదు.

మన రాష్ట్రంలో ప్రజలు అవసరం వచ్చినప్పుడు ముందుకు వస్తారన్నది ఎప్పుడూ అబద్ధం కాలేదు. మనవాళ్లు ఆరితేరిన చిచ్చర పిడుగులే అయినా, శాంతి సమర విధానంపట్ల కాగి చల్లారిన పాలు. 1921 నాటి శాసన ధిక్కార సంరంభంలోనూ, 1922 లో గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమంలోనూ, సైమన్ కమిషన్ బహిష్కరణ విషయంలోనూ, శాసన ధిక్కార సంరంభాలలోనూ మనవాళ్ళు విజయాలు సాదించిన యోధులే.

కాల వ్యవధిలేని కారణంగా, జిల్లాలకు ఉరుకులమీద వెడుతూ, ప్రజలలోని ఉత్సాహాన్నీ, వారికి ఉన్న పట్టుదలనీ గ్రహించగలిగాను. నిమిషాలమీద అన్ని జిల్లాలవారూ, ఎల్లా ఎల్లా పదకాలమీద పదకాలు వేసుకుని, ఈ ఉప్పు సత్యాగ్రహానికి సన్నద్ధులవుతూ ఉన్నదీ గ్రహించాను.

ఆంధ్ర పత్రికా సంపాదకులూ యజమానులూ అయిన దేశోద్థారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు నేను ఢిల్లీనుంచి వచ్చే నాటికి పట్నంలో తాము ఏ విధంగా కార్యభారం వహించాలో, ఏం చెయ్యాలో కూడా అంతు చిక్కని పరిస్థితిలో ఉన్నారు. పట్నంలో అనువయిన వాతావరణం లేదనే ఆయనా తలచారు. ఆయన బందరుకో, గుంటూరుకో వెళ్ళి, డా॥పట్టాభి సీతారామయ్యగారితోటో, దేశభక్త కొండ వెంకటప్పయ్యగారితోటో కలిసి యేమయినా చేద్దాం అని అనుకున్నారు. ఆయన బందరూ, గుంటూరూ కూడా వెళ్ళి, ఈ సంరంభా