పుట:Naajeevitayatrat021599mbp.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక ప్రఖ్యాత న్యాయవాదిగా కూడా వారి హృదయం నాకు సువిదితమే. అందువల్లనే నాకు మద్రాసు పౌరులయందు అఖండ విశ్వాసం ఉంది. దానికి తోడుగా, నాకు చాలా సన్నిహితులయిన మిత్రులతోనూ, హృదయాంతరాలలో కాంగ్రెసుపై అభిమానం గల ఇతర నాయకాగ్రగణ్యులతోనూ సంప్రతించి మరీ కార్యరంగంలో ప్రవేశించాను. ముందుగా వాలంటీర్ల మకాములకు, వారికి శిక్షణ ఇవ్వడానికీ వీలుగా ఉండే తావుకోసం అన్వేషణ ఆరంభించాము.

ఉదయవనం క్యాంపు

లోగడ పంజాబులో గురుకాబాగ్ క్యాంపును గురించీ, ఆనాటి నా అనుభవాలను గురించీ, అప్పుడు కలిగిన అభిప్రాయాలను గురించీ విశదంగా తెలియజేసే ఉన్నాను. ఆ అనుభవాలను పురస్కరించుకుని సమగ్రమయిన, పరిపూర్ణమయిన క్యాంపును నడపడానికి వలసిన ఒక సువిశాలమయిన బంగళా కోసం మద్రాసులోని పేటలన్నీ గాలించాం. ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యకు స్థావరంగా జాగా యివ్వడానికి చాలామంది భయపడ్డారు.

మైలాపూరులో ఉన్న 'ఉదయవనం బిల్డింగ్స్‌' అనే ఒక విశాల భవనం ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకుని, అ భవనం యజమానిని కలుసుకోవడానికి స్వయంగా నేనే బయల్దేరాను. ఆయనకీ ఏవేవో భయాలు, సంకోచాలూ ఉన్నా, నెలకి రెండు వందలు అద్దె క్రింద యిస్తానని అనడాన్ని, కొంచెం మెత్తబడ్డాడు. వ్రాతమూలకమయిన అగ్రిమెంట్లయిన తర్వాత, అడ్వాన్సు ఇచ్చి, ఆ బిల్డింగును మా ఆధీనంలోనికి తీసుకున్నాం. అది బాగా విశాలమయిన భవంతి కాకపోయినా, దానికి మూడంతస్తు లున్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ జాగా వాలంటీర్లకి ట్రెయినింగ్ ఇవ్వడానికి సుమారుగా సరిపోతుంది.

వాలంటీర్ల కోసం నేనొక విజ్ఞప్తి జేశాను. శ్రీమతి దుర్గాబాయి ఆధీనంలో ఆ సంస్థ నడప దలచాము. పట్నంలో పబ్లిక్ మీటింగ్ పెట్టే లోపల, జిల్లాలవారీగా జరుగుతూన్న ఏర్పాట్లను చూడడానికి బయల్దేరాను.