పుట:Naajeevitayatrat021599mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎదట కనిపించాను. ఆయనకి ఎక్కడలేని సంతోషమూ కలిగింది. ఆపైన కొంత సంభాషణ అయ్యాక "పోనీ నువ్వుకూడా ఇక్కడే చదువుకోరాదా?" అని అడిగారు. దానిమీద నేను, "మా వాళ్ళంతా అక్కడ వున్నారు కదా! నన్ను ఇక్కడ ఎవ్వరు చూస్తారు?" అన్నాను. దాని మీద ఆయన "అక్కడ మాత్రం ఎవ రున్నారు? మీ అమ్మగారూ, అమ్మమ్మగారూ కష్టపడవలసిందే గదా? ఇక్కడే నాతోపాటు తంటాలు పడకూడదా?" అని ఆప్యాయంగా అన్నారు.

ఒక్కక్షణం అట్టే ఆలోచించాను. నా జీవితంలో అది ఒక అపూర్వమైన ఘడియ! అదే ఈ జీవితం యావత్తూ ఇల్లాగ పరిణామం చెందడానికి మూలకారణమైన నిమిషం! "Life is a series of Accidents" అంటే జీవితమంతా "ఆకస్మిక ఘటనావళి" అనే మాటల్లో ఎంతో అర్థం వుంది. నాకు పడవే అంది, ఒంగోలు తిరిగి చేరితే జీవితం ఏమి అయి వుండేదో, ఎట్లా పరిణమించేదో పరమేశ్వరుడికే ఎరుక! నేను పడవ దాటిపోయి వెనక్కి రావడమూ నాయుడుగారికి మనస్తాపం కలిగి నన్ను తమ దగ్గర వుండమనడమూ. రెండూ కూడా దైవఘటనలే! ఒక్కక్షణం ఆలోచించి చేతులో ఉన్న బట్టలమూట అలాగే కింద పడవేసి, "మీ అభిప్రాయం అల్లా వుంటే సరే ఉండిపోతాను!" అన్నాను. వెంటనే ఆ థీయిష్టిక్ హైస్కూల్లోనే 5 వ క్లాసులో రెండో అర్ధసంవత్సరంలో చేరాను. ఆ రోజుల్లో చదువులికి దేశమంతా ఒకటే పాఠ్యవిధానం వుండడంచేత స్కూలు మారడంవల్ల చదువు కేమి ప్రతిబంధకం కలగలేదు. నాయుడుగారు నా విషయమై ఏలూరి లక్ష్మీనరసింహంగారికి శిఫారసు చేసి, 'విద్యార్థివేతనం' కూడా సంపాదించారు. ఇల్లాగ దైవికంగా రాజమహేంద్రవరంలో చదువుకి ప్రవేశించాను. ఈ సంగతి మా వాళ్ళకి ఉత్తరం వ్రాస్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. కాని, నాయుడుగారితో వుండడంవల్ల వాళ్లు మనస్సులు కొంత సమాధానపరచుకున్నారు.