పుట:Naajeevitayatrat021599mbp.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గద్దె రంగయ్యనాయుడిది, రెండవది పి. ఎస్. భాష్యం చెట్టిది. వారు ఉభయులూ ఉప్పు సత్యాగ్రహాన్ని గురించి ప్రబోధం చేస్తున్నారు. ఆ ప్రబోధాలను గురించి చిన్న చిన్న రిపోర్టులు పేపర్లలో అక్కడక్కడ ఏ మారుమూలో కనబడేవి.

తంజావూరు జిల్లాలో వేదారణ్యం గ్రామనుంచి రాజగోపాలాచారిగారు ఉద్యమం నడపనున్నారని విన్నాను. మదరాసు వాతావరణాన్ని పరిశీలించిన ఆచారిగారికి అక్కడి పరిస్థితులు సత్యాగ్రహ సమరానికి అనుకూలంగా లేవని తోచినట్లుంది. అదే అభిప్రాయం ఆ పురవాసులలో చాలా మందికి ఉన్నట్లు గ్రహించాను. మదరాసు మేయరు సత్యాగ్రహంపట్ల వ్యతిరేకంగా ఉన్నాడు.

"హిందూ"పత్రిక అనుకూలంగా లేదు. నా సంపాదకత్వాన నడుస్తూన్న 'స్వరాజ్య' పత్రిక, కృపానిధీ, ఖాసా సుబ్బారావు మాత్రం ఎలాగయితేనేం కాంగ్రెసు తత్వం, కాంగ్రెసు కార్యక్రమ విధానాలపట్ల సహనం చూపగలిగారు. ఆ పట్నంలో ఉన్న ఆ కొద్దిపాటి కాంగ్రెసు నాయకుల పరిస్థితి అల్లా ఉన్నా, నాకు మాత్రం ప్రజా హృదయం కాంగ్రెసు వైపే మొగ్గి ఉందనీ, ఉద్యమానికి మంచి ప్రోత్సాహం లభించి అది విజయవంతం అవుతుందని గట్టి నమ్మకమే.

1921 లో స్థాపించబడింది లగాయితు నాచే నడపబడుతూన్న 'స్వరాజ్య' పత్రిక యీ పది సంవత్సరాలలోనూ నిరాటంకంగా, కాంగ్రెసుకు అనుకూలంగా, నిర్భీతితో ప్రచారం చేస్తూ, చిన్నలకీ - పెద్దలకీ, అజ్ఞానులకీ - విజ్ఞానులకీ కూడా కావలసిన ప్రబోధాన్ని సమకూరుస్తూనే ఉంది. మా పత్రికని అతివాద పత్రికగానే జమకట్టి త్రోసిపారేసేవారు. సైమన్ కమిషన్‌వారు పట్నానికి వచ్చిన ఆ రెండు సందర్భాలలోనూ (1928, 29) మద్రాసు పౌరులు యావన్మందీ ఒకే త్రాటిమీదా, ఒకే మాటమీదా ఉంటూ, కాంగ్రెసు ఆదేశాన్ని ఎల్లా పాటించారో అందరూ ఎరిగినదే.

మదరాసు ప్రజానీకాన్నీ, వారి హృదయాన్నీ నేను 1921 నుంచీ కేవలం ఒక రాజకీయ వేత్తగా మాత్రమే గ్రహించలేదు; 1907 నుంచీ