పుట:Naajeevitayatrat021599mbp.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడుగుపెట్టాం. నా ఆత్మమిత్రుడూ, నాయకాగ్రేసరుడూ అయిన మాలవ్యా పండితుడు ఆ క్షణంనుంచీ సమరం సాగించారు. ఢిల్లీలోనే ఎన్నో సభలలో విదేశవస్త్ర బహిష్కరణను గురించి చాలాధీమాగానూ, శక్తిమంతంగానూ ఉపన్యాసాలిచ్చారు. రాజీనామా యిచ్చిన ఇతర మిత్రులు వారి వారి నియోజక వర్గాలకు తరలి వెళ్ళారు.

గుంటూరులో జరుగనున్న ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ మీటింగులో పాల్గొనవలసిందని నాకు పిలుపు వచ్చింది. ఢిల్లీ వదలి మదరాసు వెడుతూ దారిలో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగుకు హాజరయ్యాను. ఆ గుంటూరు సభకు మెంబర్లందరూ వచ్చారనే అనాలి. వారు సత్యాగ్రహ సమరానికి ఒక జాబితా తయారు చేశారు. మిత్రుడు దేశభక్త కొండ వెంకటప్పయ్య, ఇతర ప్రముఖులు ఆ సభకు హాజరయ్యారు. ఆ కాగితంమీద మొదటి అంకెని విడిచి తక్కిన అన్ని అంకెలకూ ఎదుట సంతకాలు చేయబడ్డాయి. ఆ మొదటిస్థానం మాత్రం అల్లా ఖాళీగా ఉంచబడింది. వందన పురస్సరంగా నాకు వదలిన ఆ వదలిన ఆ ప్రథమ స్థానంలో నేను సంతకం పెట్టాను.

మా సత్యాగ్రహ పథకం

ఆంధ్రనాయకు లంతా ఈ ఉప్పుసత్యాగ్రహాన్ని విజయవంతంగా సాగించడం ఎల్లాగని ప్రశ్నించారు. అక్కడ జేరిన వారిలో చాలామంది, సముద్రపు నీటిని ఒకరి తర్వాత ఒకరు మరగబెట్టి ఉప్పు చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన జయం సాధ్యంకాదన్న అభిప్రాయం వెల్లడించారు. మేము కొంత తర్జనభర్జన చేసి ఒక పథకం వేశాం.

ఆ పథకం ప్రకారం ఉద్యమం, ఆరంభంలో కాకపోయినా, కొంతవరకూ సాగేసరికి మాంచి రసకందాయపు పట్టులో పడుతుందని నిశ్చయించాం. సముద్రపుటొడ్డున ఉన్న మా సొంత పొలాలలోమళ్ళు గట్టి సముద్ర జలాన్ని ఆ మళ్ళలోకి మళ్ళించి ఉప్పు పండించాలని నిశ్చయించాం. ప్రభుత్వంవారి ఉప్పు గిడ్డంగులపై దాడి చేద్దాం అనీ,