పుట:Naajeevitayatrat021599mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉద్యోగం? ఈపాటి ఉద్యోగం ఇక్కడ దొరకదా!?" అని అంటూ వుండేవారు. ఆమె బంధువులు ఇమ్మానేని లక్ష్మీకాంతరావు ప్రభృతులు పెద్ద ఉద్యోగాల్లో, గౌరవంగా కాలక్షేపం చేస్తూ వుండేవారు. ఆమె, "ఇంతమంది వుంటూండగా ఒక ఉద్యోగం అయినా దొరకదా?" అని అంటూ వుండేది. నాయుడుగారు "ఇక్కడ మనకి ఉద్యోగం ఎవరిస్తారు? అప్పుడే ఇక్కడికి ఎఫ్.ఏ.లూ, బి.ఏ.లూ తయారై వున్నారు. వీళ్ళ మధ్య మనకి ఉద్యోగం దొరుకుతుందా?" అనేవారు. ఇల్లాగ కొంత తర్జనభర్జన జరుగుతూ వుండగా ఏలూరి లక్ష్మీనరసింహంగారు థీయిస్టిక్ హైస్కూలు అనే కొత్త స్కూలు స్థాపించడానికి నిశ్చయించారు. లక్ష్మమ్మగారి బంధువులంతా ఆయనతో చెప్పి నాయుడుగారికి లెఖ్కల మాస్టరీ ఒకటి ఏర్పాటు చేయించారు. జీతం మామూలు 30 రూపాయలే.

స్కూలు తీశారు. నాయుడుగారు రాజమహేంద్రవరంలో మాస్టరీలో చేరారు. నేను ఇంటికి పోవడానికి సెలవు తీసుకున్నాను. అప్పటికి కాలవలు వదిలారు. రాజమహేంద్రవరం రేవులో పడవ ఎక్కితే బెజవాడ దాకా ఏలూరు కాలవమీదా, తరవాత కొత్తపట్టణం దాకా బకింగుహాముకాలవమీదా, ప్రయాణం చెయ్యడానికి బాగా వీలుగా వుండేది. అందుకోసమని నాకున్న నాలుగు గుడ్డలూ మూటగట్టుకుని, నేనొక్కణ్ణి వెళ్ళగలనని నాయుడుగారికి ధైర్యం చెప్పి పడవలరేవుకి బయలుదేరాను. తీరా రేవులోకి వెళ్ళేసరికి పడవలు దాటిపోయాయి. అందుచేత విధిలేక మళ్ళీ ఇంటికి వచ్చాను.

నేను తిరిగి వచ్చేసరికి నాయుడుగారు మధ్యాహ్నం విరామంలో స్కూలునించి వచ్చి నేను వెళ్ళిపోయానని చెప్పేసరికి దిగాలుపడి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుగుంటున్నారు. పక్కనున్న ఆయన బంధువుడు ఒకాయన, "బ్రాహ్మణ పిల్లవాడు, ఏదో మాటవరసకి నీతో వచ్చాడు కాని, ఎల్లకాలం నీతో వుంటాడటయ్యా వాళ్ళ వాళ్ళ నందరినీ విడిచి పెట్టి?" అని ఆయన్ని మందలించారు. కాని, నా యందుండే అవ్యాజ ప్రేమవల్ల నాయుడుగారు దు:ఖం ఆపుకోలేకపోయారు.

ఇలాంటి స్థితిలో పడవ దాటిపోయి నేను మళ్ళీ ఆయన కళ్ళ