పుట:Naajeevitayatrat021599mbp.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రం ఆయనయందు అంత గౌరవం ఉంది. నా ఉద్దేశంలో దాదాబాయ్ నౌరోజీగారి స్వభావమూ, మాలవ్యా పండితుని స్వభావమూ ఒకటే. వారు లిబరల్స్ అయినా, మితవాదులయినా, మరేదయినా - పిరికివారు మాత్రం కారు.

మాలవ్యాగారి పార్టీలో చేరడంలో ఉద్దేశం

నేను మాలవ్యాగారికి సన్నిహితుడనయి, వారి పార్టీలో జేరాలని అనుకున్నా, ఎల్లాగయినా వారిని మార్చి ప్రత్యక్ష చర్యకు పూనుకునేలా చెయ్యాలన్నది నా ఆశయం. నేను మాలవ్యాగారితోటి, వారి పార్టీవారితోటి కొద్ది వారాలు మాత్రమే కలిసి కూర్చున్నాను. మేము ఒకర్ని ఒకరం బాగా ఎరిగిఉన్న కారణాన్నీ, మూడు సంవత్సరాలపాటు ఒకే సభలో కలిసి ఉన్న కారణాన్నీ, రెండు మూడు రోజులలోనే వారి పార్టీలో నాకు స్థానం దొరికింది. ఎం. ఆర్. జయకర్‌గారూ, ఎమ్. ఎస్. అనే, ఘనశ్యాందాస్ బిర్లా మొదలైనవారు మాలవ్యా పండితుని పార్టీ సభ్యులు.

విఠల్‌భాయ్ నన్ను అసెంబ్లీకి వస్తూ, తనకి సహకారిగా ఉండమని కోరాడు. నేను మాలవ్యాగారి పార్టీలో చేరి, అ పార్టీ ముఖ్యులలో కొందరిచేతనయినా, గాంధీగారు దండీ చేరుకునేనాటికి, ఆ 21 రోజుల లోపల, రాజీనామా ఇప్పించడమే విఠల్‌భాయ్‌కి చేయగల సహాయం అని తలచాను. ఎల్లాగయినా విఠల్‌భాయ్‌గారిచేత కూడా రాజీనామా ఇప్పించి జైలుకి తీసుకుపోవాలని నా వాంఛ. కొన్నాళ్ళపాటు విఠల్‌భాయ్‌గారిని వారి ఇంటివద్ద నిత్యమూ కలుస్తూ వచ్చాను. మాలవ్యాగారి పార్టీ డిప్యూటి లీడర్ జయకర్‌గారితో నాకు భేటీ వచ్చి, మేము తీవ్రంగా వాదించుకున్నా, తుదకు ఆయన్ని నా వైపు త్రిప్పుకుని, ఉప్పు సత్యాగ్రహ సంరంభంలో పాల్గొనడానికి వారి పార్టీ సభ్యులం పధ్నాలుగురం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా ఇస్తామనీ, అ పద్నాలుగురిలోనూ మాలవ్యా పండితుడు, అనే, బిర్లా మొదలైనవారు ఉంటారనీ విఠల్‌భాయ్ గారితో చెప్పాను. బిర్లామాత్రం సూక్ష్మబుద్ధీ, వివే