పుట:Naajeevitayatrat021599mbp.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తిని నిరూపించే ఉద్దేశంతో ఎన్నికయ్యానుగాని, నాకు శాసన సభా సభ్యత్వంమీద మోజుఉండి కాదనీ, అందువల్ల అసెంబ్లీ సభలకు హాజరవ్వాలనే ఉద్దేశం లేదనీ తెలియ జేశాను.

విఠల్‌భాయ్ వద్దనుంచి నా కా 'పిలుపు' వచ్చేవరకూ, నాకు ఆ అభిప్రాయమే (అసెంబ్లీకి వెళ్ళకూడదని) గట్టిగా ఉండేది. విఠల్‌భాయ్ గారు చెప్పి పంపించిన ఈ సమాచారం ఇంకొక అసెంబ్లీ సభ్యుడు మోసుకొచ్చాడు. ఆయన నాకు సన్నిహిత మిత్రుడు. పోలీసుకు శాసన సభలో ప్రవేశం లేకుండా ఆయన తీసుకున్న చర్యలగురించి, వాటి పర్యవసానాల గురించీ కూడా విన్నాను. నిజంగా ఆయనతప్ప ఏ ఇతర అధ్యక్షుడూ సాహసించి అల్లా వ్యవహరించి ఉండలేడన్న విషయం గ్రహించాను.

ఢిల్లీ ప్రయాణం

ఢిల్లీకి ప్రయాణమై వెళ్ళి, వారిని వారి ఇంటివద్ద కలుసుకుని, సంగతి సందర్భాలన్నీ దీర్ఘంగా చర్చించాను. ఆ తరవాతే అసెంబ్లీకి వెళ్లాను. నేను అసెంబ్లీ హాలులో ప్రవేశించిన తక్షణం, తమ తమ పార్టీలకు సన్నిహితుడను కావచ్చుననే ఆశతో కాంగ్రెసేతర పార్టీల వారందరూ నాకు అభినందనాలు చెప్పి నన్ను ఆహ్వానించారు. ఆ కాంగ్రెసు నేషనలిస్ట్ పార్టీవారు మళ్ళీ నన్ను స్వయంగా ఆహ్వానించి, తమ పార్టీనాయకత్వం వహించి, వారి బెంచీలమీద ఆసీనుణ్ణి కావలసిందని కోరారు. నమస్కార పురస్సరంగా వారి వారి ఆహ్వానాలను తిరస్కరించాను.

"నీవు ఒక్కడవూ విడిగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా కూర్చున్నా సంతోషిస్తాను గాని, నీవు ఏ పార్టీ వారితోనూ కలవవ"ద్దని విఠల్‌భాయ్ కోరాడు.

అసెంబ్లీ హాలూ, పరిసరాలూ పర్యవేక్షించి, పండిత మదనమోహన మాలవ్యాగారితో ఆయన బ్లాకులో కూర్చోవాలనీ, ఆయన పార్టీలో సభ్యత్వంకూడా స్వీకరిద్దామని తలచాను. మాలవ్యా పండితుడు మితవాది అని కొందరూ, లిబరల్ అని కొందరూ అంటూఉన్నా నాకు