పుట:Naajeevitayatrat021599mbp.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసుతో కయ్యం బెట్టుకొని, రాజీనామా ఇచ్చి, తిరిగి ఎన్నికలకు నిలిస్తే, మీకు ఓటు ఎవ రిస్తా"రని అడిగాడు. "ఏం జరుగుతుందో కాస్త తమాయించుకుని చూడవోయి" అన్నాను నేను. "మీరూ, మీ కాంగ్రెసు మెంబర్లూ నాకు ఓటు చేయకపోయినా, నాకు వ్యతిరేకంగా ప్రచారంచేసి నన్ను పడగొట్టాలని చూసినా, ప్రజలు ఎప్పుడూ నావైపే ఉండి నన్ను గెలిపించి తీర్తా"రన్నాను.

ఆవెంటనే మిత్రులు ముళ్ళపూడి పళ్ళంరాజూ, మారిన నరసన్నా లేచి, "కాంగ్రెసు సభ్యులం అయిన మనం ఓటు చేసినా చెయ్యకపోయినా, ప్రజలలో నూటికి 95 మంది ఆయనకే నిస్సంశయంగా ఓటు చేస్తా" రన్నారు. "అంతేకాదు ఈమధ్య ఆయన ప్రజలకోసం చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన రీసెటిల్మెంట్ రేట్లు హెచ్చించాలన్న ఒక్క ప్రతిపాదన చాలు. దీనికి తోడు, ఆయనకున్న పలుకుబడీ అవీ అల్లాగే ఉన్నాయి. అందువల్ల ఎలాంటి పరిస్థితులలో నయినా ఆయన్ని ఎవ్వరూ వదులుకోరు. అంతా ఆయనకే మద్ధత్తు ఇస్తా" రని కూడా వారన్నారు.

ఆ ఇరువురూ ముఖ్యమయిన కమిటీ మెంబర్లు. వారే ఇలాంటి బహిరంగ ప్రకటన చేసే సరికి, డా॥ సుబ్రహ్మణ్యం లాంటి మిత్రులకు చాలా ఆశ్చర్యంవేసింది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘ అధ్యక్ష పదవికి, శాసన సభా సభ్యత్వానికీ నేను ఇచ్చిన రాజీనామాలు అంగీకరించబడ్డాయి. నేనొక స్వతంత్ర్య వ్యక్తినయ్యాను. ఎన్నికలకి నన్ను నా సొంత టికెట్ మీదే నామినేట్ చేశారు.

సొంత టికెట్‌మీద పోటీ లేకుండా ఎన్నిక

నా నామినేషన్ బందరులో దాఖలు చేయవలసి ఉంది. నా నియోజక వర్గం కృష్ణాజిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి మండలాలూను. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీవరకూ దేశంలో రకరకాల పుకార్లుండేవి. నాకు పోటీ ఉంటుందనీ, మొదటినుంచీ కాంగ్రెసుపార్టీ వారికి పోటీ దారులే అయిన జస్టిస్ పార్టీవారూ, తదితర పార్టీలవారూ, నేను కాంగ్రెసును కాదని దెబ్బలాడి బయటికి వచ్చిన కారణంగా కాంగ్రెసు వారూ