పుట:Naajeevitayatrat021599mbp.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదికులాసాగా వుండేవి. ఆ ప్రయాణాల్లోనే గోదావరి మహానది విస్తీర్ణమూ, ప్రయోజనమూ బాగా అవగాహన అయ్యాయి.

అప్పట్లో రాజమహేంద్రవరం అంటే నేటి పాతపట్టణం మాత్రమే. ముఖ్యమైన భవనాలల్లా చిత్రాంగీ రత్నాంగుల మేడలే. అప్పటికీ గోదావరి గట్టు లేదు. బ్రిడ్జి అసలే లేదు. నేటి ఆర్యాపురానికంతటికీ రెండో మూడో ఇళ్ళు ఉండేవి. మిగతావన్నీ కలప అగితీలే. ఇన్నీసుపేట కొంచెమే వుండేది. గచ్చు కాలవలు లేకపోయినా డ్రెయినేజీ వగైరాలు చక్కగా వుండేవి.

నేను రాజమహేంద్రవరం చేరేసరికి అప్పట్లో కొద్దిమంది న్యాయవాదులు వుండేవారు. అప్పటికి ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు పంతులు, మాతర్ల సుబ్బారావు నాయుడు, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడుగార్లు బి.ఏ, బి.ఎల్ పాసయి ప్లీడరీ చేస్తున్నారు. జిల్లా కోర్టు, మునసబు కోర్టూ ఒక పాత ఇంట్లో వుండేవి. ఏలూరు రాజ్యలక్ష్మీ నరసింహంగారు, నేతి సోమయాజులుగారు మొదలయిన వారు ప్లీడర్లు. సరిపల్లి సాంబశివరావు, గోపాలకృష్ణమ్మ, దామరాజు నాగరాజు ప్రభృతులు పట్టాలు పొందిన ప్లీడర్లు. ఇక పాండిత్య విషయంలో, అప్పటికే వీరేశలింగం, వడ్డాది సుబ్బారాయుడుగార్ల పేర్లు మోగి పోతున్నాయి. వారిద్దరికీ సాహిత్యసంబంధమైన ఈర్ష్య వుండేది. సంస్కృత పండితుల్లో కల్లూరి వెంకటరామశాస్త్రులుగారి కీర్తి బాగా వుండేది. అప్పుడు శుద్ధ గ్రాంథిక భాషలో మాట్లాడతారని పేరుపొందిన కొక్కొండ వెంకటరత్నం గారికి కూడా మంచి ప్రసిద్ధి వుండేది.

మా సెలవలు పూర్తి కావచ్చాయి. నాయుడుగారి భార్య లక్ష్మమ్మగారికి మొదటినించీ బంధువులకి సమీపంగా రాజమహేంద్రవరంలో వుండాలనే కోర్కె వుండేది. ఒంగోలులో అప్పులు పెరిగిపోవడం వల్లా, ఆ అప్పులు తీరే మార్గం కనిపించకపోవడం వల్లా ఆమె కోరిక మరింత దృఢపడింది. ఆమెకి రాజమహేంద్రవరంలోనూ రామచంద్రపురంలోనూ వుండే బంధువులంతా, "అంతదూరంలో ఏమిటా