పుట:Naajeevitayatrat021599mbp.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోవటం లేదని చెప్పాడు. అటువంటి చికాకు పరిస్థితులలో ఆయన ఇచ్చే జవాబులు ఎప్పుడూ, మోటుగానూ, ఘాటుగానూ, అహంకార పూరితంగానూ ఉండేవి. హక్కునుబట్టి జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెసు అధ్యక్షుడే అయినా, పండిత మోతీలాల్ నెహ్రూ మాత్రం నిజంగా ప్రెసిడెంటే! జవహర్‌లాల్ నెహ్రూతో ఏ విషయం గురించీ విడిగా తర్కించవలసిన అవసరమే ఉండేది కాదు.

గాంధీగారు రాజీనామా లివ్వాలా, అక్కర లేదా అనే విషయంమీద ఆసక్తే చూపలేదు. నాకేమో మోతీలాల్ నెహ్రూగారితో ఏకీభవించాలని లేదు. రాజీనామా లివ్వకుండానే, శాసన సభా సభ్యత్వంతోనే జెయిళ్ళకు వెళ్ళడమనేదే మా ఉద్యమానికి బలం అని నా భావన. వారు నా ప్రతిపాదనకు అంగీకరించకపోయే సరికి నేను రాజీనామా ప్రతిపాదనకు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తపరచి, అ కాంగ్రెస్ బహిరంగ సమావేశాలలో వారి విధానం సవాలు చేసి, నేను ఏ సంఘం తరపునా కాకుండా స్వశక్తిమీదనే ఎన్నికయి తిరిగి కౌన్సిల్‌లోకి రాగలనని ధీమాగా చెప్పాను.

రాష్ట్ర కాంగ్రెసు సంఘంలో చర్చ

అ ప్రకారం కొద్దికాలం నేను కాంగ్రెసుపై తిరుగుబాటు చేశాను. నా చర్యకు మా రాష్ట్ర కాంగ్రెసు సంఘంమాత్రం బాధపడింది. 1930 ప్రారంభ దినాలలో నేను రాజీనామా ఇస్తాను, మళ్ళీ ఎన్నికలలో పాల్గొంటాను అని కాకినాడలో జరిగిన రాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగ్‌లో అన్నప్పుడు, నా సన్నిహిత మిత్రులు చాలా బాధ పడ్డారు. ఆ మీటింగులో నాకు బాగా సన్నిహితుడైన యువక మిత్రుడు, కీ॥ శే॥ డా. సుబ్రహ్మణ్యం, నిజంగా చాలా బాధపడ్డాడు. ఆయన చాలాకాలం నుంచీ నో - ఛేంజ్ వర్గానికి చెంది, గాంధీగారి అడుగు జాడలలో నడుస్తున్నాడు.

ఈ కాంగ్రెసు ఉద్యమం ఆరంభమయిన నాటినుంచీ, నా యందుండే గౌరవాభిమానాలతో, నాకు సన్నిహితుడుగా, నన్ను అంటిపెట్టుకునే ఉండేవాడు. పాపం, అతడు నిజంగా మన:క్లేశంతో, "మీరు