పుట:Naajeevitayatrat021599mbp.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దృష్టిలో ఉన్న ఆ యుద్ధకాండ అప్పట్లో అవాంఛనీయమనీ, దానికి యుక్తకాలం రాలేదనీ కేంద్ర శాసన సభా కార్యక్రమ విమర్శకులు అన్నారంటే, వారు అల్లా అనడంలో పొరపాటు లేదనే అనవలసి ఉంటుంది.

కాని నిజానికి వారికిగాని, ప్రభుత్వానికి గాని ప్రజలు యుద్ధానికి ఏనాడో సిద్ధమయ్యేఉన్నారనీ, ఇన్నాళ్ళబట్టి వారి ఉద్రేకాలు నొక్కి పెట్టబడి ఉన్నాయనీ తెలియదు. గాంధీగారికి మాత్రం దేశం ఎప్పుడూ తనకు దమ్ముగా ఉంటూ, తనతోపాటు రంగంలో ఉరకడానికి సిద్ధంగానే ఉందని బాగా తెలుసు. ప్రజలు సిద్ధంగా లేకపోయినా, ఆయన మార్గదర్శిగా ఉంటే, జనం ఆయన వెనకే ఉంటారనీ ఆయన తిరుగులేని విశ్వాసంతో ఉన్నారు.

పరిస్థితుల యాథార్థ్యాన్ని గ్రహించి, ఆయన, కాంగ్రెసు నాయకులతో గాక, తన ఆశ్రమంలోని అనుచరులతో 1930 లో ఉప్పు సత్యాగ్రహానికి తలపడ్డారు. నాయకులచేత సరిగా ప్రబోధితులుగాని ప్రజలను ఎల్లా నడపాలో గాంధీగారికి బాగా తెలుసు.

అప్పట్లో నాయకులు తమకు కాంగ్రెసులో ఎటువంటి పలుకుబడి ఉందో, తమకు ఎంతెంత బలం ఉందో అని తమలో తాము తర్జన భర్జనలు పడుతూన్నారన్నా, ఆ మాట అసత్యం కాదు. అందుచేతనే గాంధీగారికి తన కార్యక్రమం యావత్తూ ముందుగా విప్పిచెప్పడం మామూలు లేదు. ఆయన ఇప్పుడూ అంతే చేశాడు.

దండీ యాత్ర

ఆయన ఉప్పుచట్టాన్ని తునాతునకలు చెయ్యాలని అంటే, ఆ మాట కాంగ్రెసు నాయకులకూ, కాంగ్రెసు సేవకులకూ దిగ్భ్రమ కలిగించింది. మామూలు జనానికి అంతూ పొంతూ చిక్కలేదు. ఉప్పేమిటి - చట్టాలేమిటి - వాటిని ఉల్లంఘించడమేమిటి అనుకున్నారు. మామూలు జనానికి ఏం అర్థమవుతుంది గనక! అసలు, ఆ చట్టాన్ని ఛిన్నాభిన్నం చెయ్యడం అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం అవుతుందో అర్థమే కాలేదు.