పుట:Naajeevitayatrat021599mbp.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీగారి చేతులలో ఉంచబడిందన్నమాట! మోతీలాల్ నెహ్రూగారు సత్యాగ్రహ సమర మూలసూత్రంతో వెంటనేగాని, సులభంగా గాని, మనస్ఫూర్తిగా గాని సమాధాన పడలేక పోయారు. అందువల్లనే, నిర్వీర్యమయిన జాతిని ఉత్తేజపరచి, దానికి కావలసిన అవసరాలను సరిగా గుర్తించి, ప్రత్యక్ష చర్యకు దిగందే దేశానికి ముక్తిలేదని గ్రహించడానికి ఆయనకి సుదీర్ఘమయిన అయిదు సంవత్సరాలు పట్టింది. ఈ అయిదేండ్లలో పార్లమెంటరీ విధానంతోనూ, రాజీ ప్రతిపాదనలతోనూ, కాళ్ళ బేరాలతోనూ జయాన్ని సాధించాలని తంటాలు పడ్డాడు, పాపం! రాజీ ప్రతిపాదనలకి కూడా వెనుక అనుమతి రూపేణా దమ్ము ఉండాలన్న విషయం ఆయన గ్రహించలేదో, మరచిపోయారో మరి!

1929 లో దేశ పరిస్థితి

ఉడుకురక్తపు యువలోకానికి ప్రాతినిధ్యం వహించే జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోసులకు కలకత్తా కాంగ్రెస్‌లో స్వాతంత్ర్య తీర్మానం ఉద్రిక్తత తగ్గి నీరసపడడం ఎంత మాత్రమూ సహింపరాని దయింది. మోతీలాల్ గారికీ, గాంధీగారికీ ఈ యువక నాయకుల తీరులు రుచించలేదని లోగడ చెప్పివున్నాను.

కలకత్తా కాంగ్రెస్, సాంతం అయ్యేనాటికి, 1929 లో లాహోర్ కాంగ్రెస్ అనగానే శాసన ధిక్కారాది ప్రత్యక్ష చర్యలకు సిద్ధమవ్వాలి అన్నమాట అట్టే పట్టించుకున్నట్లు లేదు. అందుకు సాక్ష్యం ఆగష్టు 1929 లో నడచిన శాసన సభా సంరంభాలే. నాయకుల హృదయాలలో అస్థిరత్వం అలాగే ఉంది. కాంగ్రెసు వర్కర్లూ, కాంగ్రెసు కమిటీలూ అసందిగ్ధంగానే పనిచెయ్యటం జరిగింది.

1921 లో శాసన ధిక్కారాన్ని చవిచూసినా, అది యేనాటిమాటో అయిపోయింది. అప్పుడు ఆరంభించబడిన నిర్మాణ కార్యక్రమం నీళ్లుగారిపోయి యేళ్లూ - పూళ్లూ అయిపోయింది. దేశం యావత్తూ ఆ సంవత్సరం అంతా అధైర్యంతో అణగారిపోయి ఉంది. కాంగ్రెసువారి