పుట:Naajeevitayatrat021599mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆగినప్పుడు నాయుడుగారు నాకు రత్నకంబళ్ళ నేత చూపించారు. అప్పుడే జాగ్రఫీ పుస్తకాలలో "ఏలూరు రత్నకంబళ్ళకి ప్రసిద్ధి" అని చదువుకున్నాము. ఆయన అది చూపించడానికి నన్ను సత్రం వెనకాలవున్న రత్నకంబళ్ళు నేసేవాళ్ళ యిళ్ళకి తీసుకువెళ్ళారు. అనేకులు - అందులో ముఖ్యంగా మహమ్మదీయులు - ఈ వృత్తి వల్ల జీవించేవారు. ఆ రోజుల్లో ఆ వ్యాపారం మంచి వృద్ధిలో వుండేది.

రాజమహేంద్రవరం చేరడానికి పడవప్రయాణం చేస్తూన్నప్పుడే నా హృదయం ఉత్సాహంతో ఉప్పొంగింది. ఆ నది వైశాల్యమూ, గాంభీర్యమూ నన్ను వివశుణ్ణి చేశాయి. రాజమహేంద్రవరంలో దిగుతూవుండగానే - ఆ రోజుల్లో ఆ పట్టణపు ఐశ్వర్యం సూచించే కలప కార్ఖానాలు, పడవలమీద దిగిన బస్తాల గుట్టలూ - కనిపించాయి. అక్కడే కొత్త పడవల నిర్మాణాలూ, పాతపడవల మరమ్మతులూ కూడా జరుగుతూ వున్నాయి. రాజమహేంద్రవరంలో దిగేసరికి మా నాయుడుగారి దగ్గర చదువుకున్న ఇతిహాసమూ, రాజరాజనరేంద్రుడి చరిత్రా, సారంగధరుడి కథా, భారతం రచించిన కవుల గాథలూ, ఇత్యాదులన్నీ స్ఫురణకి వచ్చాయి. వేసవికాలం సెలవలు గడవడం తోనే వెళ్ళిపోదామనే సంకల్పంలో ఉండడంవల్ల నాయుడుగారు నాకు ఆ ఊళ్ళోవున్న ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూపించారు.

సారంగధరుడి మెట్ట, దానిమీద కాళ్ళు నరకబడిన సారంగధరుడి శిల, చిత్రాంగి మేడ, రత్నాంగి మేడ, పావురం వాలినచోటు, మొదలైనవన్నీ చూపించారు. కోటిలింగాల క్షేత్రం దగ్గరకి తీసుకువెళ్ళి, ఆ లింగాలన్నీ చూపించారు. నేను అవన్నీ లెక్కపెట్టడం ప్రారంభించి, "కోటీ లేవేమి?" అని నాయుడుగారిని అడిగాను. ఆయన అవన్నీ ఒకప్పుడు వుండేవనీ, క్రమంగా కరిగిపోయి నదీ గర్భంలో జీర్ణమయి వుంటాయనీ చెప్పారు. మేము రాజమహేంద్రవరం చేరిన కొద్దిరోజులకి కాలవలు వదలడం వల్ల రహదారీ పడవల మీద రామచంద్రపురం, అమలాపురం, మొదలైన గ్రామాల్లో వున్న నాయుడుగారి చుట్టాల ఇళ్ళకి వెళ్ళాము. ఆ పడవప్రయాణాలు చాలా