పుట:Naajeevitayatrat021599mbp.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లభించకుండా సాధ్యం కాదుగదా? ఇప్పట్టున నేను ఒక పత్రికా సంపాదకునిగానూ, కేంద్ర శాసన సభా సభ్యునిగానూ, భారత కష్టజీవికి సహాయపడడానికి చేసిన ప్రయత్నాన్ని గురించి చెప్పడం న్యాయం.

కేంద్ర సభలో కష్టజీవుల ప్రసక్తి

కేంద్ర శాసన సభా సభ్యుణ్ణిగా 1927 - 28 లోనూ, 1930 లోనూ నేను భారత కష్టజీవుల పరిస్థితులను గురించీ, ఇతర దేశాలలో ఉండే కష్టజీవుల పరిస్థితిగురించీ, కష్టజీవుల సంఘాల నాయకులద్వారా సేకరించగలిగాను. ఈ సమాచారం అసెంబ్లీలో కార్మిక వ్యవహారాలను గురించి ప్రశ్నించి సమాధానాలు సంపాదించడానికి ఉపయోగపడింది. నేను ఈ వ్యవహారాలు ఆమూలాగ్రంగా గ్రహించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాను.

ఆఫ్రికా ఖండాన్ని ఆ దేశవాసుల సుఖ సౌఖ్యాలకోసం సరిగా రూపొందించడానికి మన కష్టజీవులను గవర్నర్ జనరల్ ఆఫ్రికా పంపించడానికి చేసిన తొలి ప్రయత్నాల దగ్గరనుంచీ ఆ కష్టజీవుల పరిస్థితి ఎల్లా ఉండేదో సమగ్రంగా గ్రహించగలిగాను. వారు కష్టపడి చెమటోడ్చి, నివాస యోగ్యంగానూ, సకల ఫల సంపన్నంగానూ రూపొందించిన ఆ ప్రాంతాలలో వారికి ఈ నాటికీ పౌరహక్కులయినా లేవు.

నేను ఈ రాష్ట్రంలోని మలబారు, కోయంబత్తూరు, నీలగిరి తాలూకాలలోనూ, అస్సాంలోనూ కూడా మన కష్టజీవుల సహకారంతో కాఫీ, టీ, రబ్బరు వగైరా తోటలు పెంచి, వాటి ఫలసాయాన్ని అనుభవిస్తూన్న ఆంగ్లేయుల హయాంలో ఆ కష్టజీవుల పరిస్థితి ఎల్లా వుందో గ్రహించాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాలు పర్యటించాను.

దేశదేశాలలో కార్మికుల పరిస్థితులు ఎల్లా ఉన్నాయో స్వయంగా గ్రహించాలనే ఉద్దేశంతో నేను బర్మా, సిలోన్, మలయా, సయాం, ఇండో చైనా మొదలైన దేశాలన్నీ పర్యటించి, ఆ ప్రాంతాలలో ఉన్న ప్లాంటేషను లన్నింటినీ పూర్తిగా పరిశీలించాను. ఆయా ప్రాంతాలలో