కనక యింట్లోవాళ్ళు విధిలేక చిట్టచివరికి అంగీకరించారు! నాయుడుగారు కూడా మా ఇంటికి వచ్చి, "అంత పట్టుదలగా ఉన్నప్పుడు పంపండి. నేను జాగ్రత్తగా తీసుకువస్తాను" అని చెప్పారు. మా అమ్మమ్మగారు "మా వాడికి భోజనం ఎల్లాగ?" అని ఆతృతగా అడిగింది. నాయుడుగారు "అతని కేమీ లోటు రానివ్వ" నని మా అమ్మమ్మగారికి ధైర్యం చెప్పారు.
నాయుడుగారు, ఆయన భార్య, నలుగురు పిల్లలు, తల్లి, నేనూ కలిసి ఆంచె బళ్ళమీద ప్రయాణం ప్రారంభించాము. అక్కడికి రాజమహేంద్రవరం 180 మైళ్ళ దూరంలో వుంది. బెజవాడ గ్రాండు ట్రంకు రోడ్డుమీద 90 మైళ్ళు, బెజవాడనించి విఝ్ఝేశ్వరం 90 మైళ్ళు. అప్పట్లో బెజవాడ నాలుగు మకాముల్లో చేరేవాళ్ళం. అప్పటికాలంలో సామాన్యంగా రాత్రిళ్ళంతా ఏ 20 మైళ్ళో నడవడమూ, పగలు సత్రాలున్నచోట మకాములు చెయ్యటమూ. ఒక ప్రయాణ పద్ధతిగా వుండేది. కావలిస్తే, మకాముల్లో బెజవాడవరకూ అంచె బళ్ళు సిద్ధంగా దొరికేవి. కాని, బెజవాడనించి రాజమహేంద్రవరం వరకూ మాత్రం బళ్ళు సులువుగా దొరికేవి కావు. దారి కూడా చాలా భయంకరంగా వుండేది. దారి పొడుగునా అరణ్యమార్గంలా కనబడేది. దానికితోడు ఎడ్లు కూడా నాసిరకం అయితే బెజవాడనించి రాజమహేంద్రవరం చేరేసరికి సుమారు 10 రోజులు పట్టేది. దారిలో ప్రతి మకాము దగ్గిరా నాయుడుగారు నాకు ప్రత్యేకంగా బ్రాహ్మణుల ఇంట్లో భోజనం ఏర్పాటుచేసి, ఆయనా, కుటుంబమూ, అంతా వంట చేసుకునేవారు.
ఇల్లాగ రెండువారాలు ప్రయాణం చేసి విఝ్ఝేశ్వరం చేరుకున్నాము. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవరం చేరాము. ఒంగోలునించి గుంటూరు వరకు దారి పొడుగునా కొండలూ, గుట్టలూ వున్నాయి. మకాముల్లో నీటి సౌకర్యాలు లేక దేశం బొగులు బొగులు మంటూ వుండేది. ఆ రోజుల్లో కాస్త కృష్ణ సమీపించేసరికి పచ్చని నేల కనబడేది. దారిలో దొంగల భయం కూడా వుండేది. అందుచేత బళ్ళు ఒంటరిగా కదిలేవి కావు. ఆ ప్రయాణంలోనే మేము ఏలూరులో