పుట:Naajeevitayatrat021599mbp.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను గ్రామాంతరంలో ఉన్న సందర్భాలలో ఒకసారి ఆ బహిష్కరణ తీర్మానం రద్దవడమూ, వెళ్ళదలచినవారు పార్టీలకు వెళ్ళవచ్చును అన్న తీర్మానం ఆమోదించబడ్డమూ జరిగింది. తర్వాత ఆ ప్రశ్న తిరిగీ చర్చనీయాంశం అయింది. ఆ విషయాన్ని తర్కించడంలో, పార్టీ లీడరుగా ఆయన ఒక్కరికీ ఆయా పార్టీలకు వెళ్ళడానికి అనుమతి ఇస్తే సరిపోతుందన్నాను. వెంటనే సి. ఎస్. రంగయ్యరు - "నిన్నే ఎందుకు వెళ్ళనివ్వాలి ఆ పార్టీలకు? నాకంటే నీవు ఎక్కువగా త్రాగగలవా?" అని సవాలు చేశాడు.

రంగయ్యరుగారి మాట తీరూ, వారి హాస్యం, అంత అపహాస్యం గానూ, మోటుగానూ ఉండేది. మోతీలాల్ గారయినా తిప్పికొట్టాలంటే గట్టిదెబ్బే కొట్టగలరు. ఇతరుల మీద తాను విసిరే విసుర్ల లాంటివి తన మీదనే కేంద్రీకరించబడి నప్పుడు, వాటికి నవ్వుతూ ఆనందంగా తట్టుకోనూ గలడు. అదీ ఆయన తత్వం.

చరిత్ర సృష్టించిన చతురుడు

మా మిత్రుడు విఠల్‌భాయ్ పటేల్ శాసన సభాధ్యక్షుడుగా ఉండేవాడు. ఆయన మాంచి నేర్పరి. ప్రపంచకంలో ఏ దేశపు పార్లమెంటరీ స్పీకర్‌గానయినా ఆయన బాగా రాణించగలడు. అటువంటివ్యక్తి కేంద్ర శాసన సభలో, అప్పటికి అమలు లోనున్న ఆచార ప్రకారం, జీతంగాని, పూచీగాని ఎంతమాత్రమూ లేని ఒక అపహాస్యపు, అవకతవక పార్లమెంట్‌కు నిష్కపటమయిన నాయకుడుగా ఉండవలసి వచ్చింది. కాని ఆయన నేర్పులో నిర్జీవమయిన ఆ పార్లమెంట్‌కు జీవంపోసి, పూచీ అన్నదిలేని సందర్భాలలోకూడా దానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నట్లు కల్పనజేసి, అందరికీ ఉత్తేజాన్ని కలిగించేవాడు. ఈ సందర్భంలో ఆ మేధావిని గురించి కాస్త విపులీకరించకుండా ఉండలేకపోతున్నాను.

అసెంబ్లీ అధ్యక్షుడుగా విఠల్‌భాయ్‌గారు సభ్యుల ప్రవర్తనాదుల విషయంలో చాలా నిక్కచ్చిగానూ, స్వతంత్రంగానూ వ్యవహరిస్తూ, ఆ జీవంలేని కేంద్ర సభలో చిన్న చరిత్రనే సృష్టించగలిగాడు. దేశ