పుట:Naajeevitayatrat021599mbp.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాగా అమలు జరగాలనీ, ప్రజలు కాంగ్రెసు పక్షాన నిలవడానికి కావలసిన ప్రబోధం చేసి, వారికి అవసరమైన విజ్ఞానాన్ని కలుగజేయాలనీ, గాంధీగారు వాంఛించేవారు. దేశం రాజకీయంగా ఇంకా మొదటిమెట్టుమీదనే ఉన్న ఆ రోజులలో, మొహనీ తాను దేశ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తున్నానని చెప్పడం, గాంధీగారి లాంటి వారికైనా విస్మయ కారణం గదా!

ఆ పరిస్థితులలో, తాను హజరత్ మొహనీ అభిలాషతో ఏకీభవించి తానూ స్వాతంత్ర్యం కావాలనే వాడనే అని అనకపోతే ఏవయినా విపరీత పరిణామా లుత్పన్న మవవచ్చునని తలచి, హజరత్ మొహనీకి ఆయన ఒక హెచ్చరిక మాత్రం చేశాడు. "లోతుపాతులు గ్రహించి మరీ స్వాతంత్ర్యం అన్నమాట ఉచ్చరించు."

అహమ్మదాబాదు కాంగ్రెస్ జరిగిన కొద్దిరోజులలోనే హజరత్ మొహనీని నిర్భంధించడమూ, ఆయనపై మోపబడిన కేసు విచారణ అయి, ఆయనకు రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించడమూ జరిగింది.

'స్వరాజ్య' పదం వెనక చరిత్ర

స్వాతంత్ర్యం ప్రతి భారతీయునికీ జన్మ హక్కు, న్యాయత: ఈ స్వాతంత్ర్య వాంఛ కాంగ్రెసుతోపాటే 1885 లో ఉత్పన్నమై, కాంగ్రెసు ఆశయమై నిర్విరామకృషికి ఆలవాలమై యుండవలసిందే, కాని, మితవాదుల చేతులలో కాంగ్రెసు ఉన్నంత కాలమూ వారికి స్వతంత్రాన్ని గురించి తలపెట్టడానికి తావే లేకపోయింది. 'స్వరాజ్యం' అన్న ముక్కే వారికి చుక్కెదురుగా కనబడేది. లోకమాన్య బాలగంగాధర తిలక్ మొట్టమొదటిసారిగా "స్వరాజ్యం నా జన్మహక్కు" అన్న నినాదాన్ని ఉచ్చరించినప్పుడు, అ మితవాదులకా ముక్కలు శరీరంలో వణుకు పుట్టించాయి.

'స్వరాజ్యం' అన్న పదం ఉపయోగించిన కారణంగా తిలక్ మహాశయుడు చిక్కులలో పడే పరిస్థితి ఉత్పన్నమయినప్పుడు,