పుట:Naajeevitayatrat021599mbp.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిని తాము చేసుకుపోతారనీ, దేశంయొక్కా, దేశీయులయొక్కా సహకారంతోగాని, సహాయ నిరాకరణంతోగాని, వారికెట్టి సంబంధమూ ఉండబోదని తెలియజేశాడు. అంటే - మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వ్యవహరించండోయి, మా పని మాత్రం మానకుండా మేము చేసుకుపోతాం అనే సవాల్ని విసిరాడన్నమాట!

వైస్రాయ్ చేసిన ఈ సవాలు కాంగ్రెసు నాయకుల వెన్నుమీద చరచి, ముందడుగు వెయ్యండోయి అనే హెచ్చరికగా పనిచేసి, సర్వత్రా బ్రహ్మాండమయిన విజయాన్ని సాధించిన ఆ బహిష్కరణ ఉద్యమానికి దోహదం చేసింది. మార్చి ఆఖరువరకూ దేశంలో పర్యటించిన ఆ సైమన్ కమిషన్‌వారు, మార్చి మాసం పూర్తిగా వెళ్ళకుండానే, బొంబాయిలో ఓడ యెక్కారు.

1929 లో, సుమారు అదే రోజులలో, ఆ కమిషన్ వారు తిరిగి వచ్చినప్పుడు, గత సంవత్సరంలో లాగే, ఎక్కడకు వెళ్ళినా వారికి చుక్కెదురయింది. ఆ నల్ల జెండాలే ఎదురయ్యాయి.

కాని, లోగడ చెప్పాను చూడండి - ప్రతి దేశంలోనూ ఎల్లప్పుడూ కొందరు విభీషణాయిలు ఉంటారని! అట్టి వారినే, ఆ 'లాయలిస్టు' లనబడే ఆ విభీషణాయిలనే కొంతమందిని కలుసుకుని, 1929 ఏప్రిల్ 14 నాటికి తమ విచారణ ముగింపు జేసుకున్నారు. ఏదయితేనేం, విరమించనున్న కన్సర్వేటివ్ ప్రభుత్వంవారు విరమించే లోపలనే, వారు కోరుకున్న ప్రకారమే, సైమను కమిషన్‌వారు తమ రిపోర్టు తయారు చేసి సమర్పించ గలిగారన్నమాట!

కృతకృత్యులైన కన్సర్వేటివ్‌లు

కన్సర్వేటివ్‌లు అనుకున్నట్టుగానే, ఎన్నికలలో వారు వోడిపోవడమూ, లేబరు పార్టీవారు రాజరికాన్ని చేపట్టడమూ జరిగింది. చేయబడిన సూచనలూ, ఇవ్వబడిన సలహాలూ ఎంత అసభ్యంగా, అవక తవకగా ఉన్నా, అవి భారతదేశం లోని కేంద్ర, రాష్ట్రీయ దృకృధాలతోనే చేయబడ్డవన్న కారణంగా, అధికారంలోకి వచ్చిన లేబర్‌పార్టీవారికి