పుట:Naajeevitayatrat021599mbp.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాయ్‌కాట్ తీర్మానానికి ప్రతిపాదించబడిన ఈ సవరణ తీర్మానం నెగ్గడంతో, కాంగ్రెసువారు, తమ పార్టీకి బలాన్ని చేకూర్చుకో లేదు సరికదా, వారి స్థాయిని మాత్రం కించపరచుకున్నట్లయింది.

ఈ పరిస్థితులు ఇల్లా ఉండగా, లాయలిష్టులు మాత్రం సైమన్ కమిషన్ విషయంలో ఆ కమిషన్‌తో ఎంత మాత్రమూ సహకరింప జాలం అనే ఒక్క ముక్కతో ఎక్కువ శక్తి సామర్థ్యాలు ప్రకటించారు.

సెంట్రల్ అసెంబ్లీలో లీడరూ, సభ్యులూ కలసి, సెక్రటరీ ఆఫ్ స్టేట్‌నీ, వైస్రాయ్‌నీ కలుసుకొని, ఇండియన్ కమిటీని నామినేట్ చేయించమని కోరుతూ ఉంటే, మద్రాసు శాసన సభ్యులుగాని, ఇతర రాష్ట్ర శాసన సభ్యులుగాని మరో రకంగా ఎల్లా వ్యవహరింప గలుగుతారు? మెంబర్లు ఎప్పుడూ నాయకుణ్ణి అనుసరించాలి. నాయకుణ్ణి వ్యతిరేకింప దలచిననాడు, మెజారిటీ ఉండక, చెరువులో చేపలలాగ బయటపడిపోతారు.

ఆ ప్రకారంగా అవలంబించ దలచిన పద్ధతిని నిర్దారణచేసికోలేని స్థితిలో ఉన్న ఆ కాంగ్రెసు పార్టీ అనబడే స్వరాజ్యపార్టీవారు (పేరు మార్చుకున్నారుగా!), బలాన్ని చేకూర్చుకుని పుంజుకోవడానికి కావలసింది పాలో, నీళ్ళో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోవడంచేత, బ్రిటిషువారు - వీరు ఎన్నికలలో బలం చేకూర్చుకోవడానికి కాంగ్రెసయ్యారుగాని, వీరి కందరికి హృదయాంత రాళాలలో తమపట్ల పూర్తి విశ్వాసమే ఉన్నదనీ, ఈ నాటకం అంతా బేరాలు ఆడే విధానంలోని భాగమేననీ, ఇస్తామన్న వాటి కంటె మరికొన్ని సదుపాయాలకోసం పీకులాట తప్ప మరేమీ కాదనీ తలచడానికి కారణం అయింది.

స్వరాజ్యపార్టీ పుట్టింది లగాయితూ, 1923 నుంచి అయిదుసంవత్సరాల కాలంలోనూ వ్యవహరించిన తీరునుబట్టి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ గౌరవాన్ని ఎంత మాత్రం పొందలేకపోయారు. కాగా ఆయన మరింత బిర్రబిగియడమే జరిగింది, "మే మేదిస్తే దానినే తీసికోవాలిగాని, ఏమి టిదంతా? ఈ అట్టహాసం అంతా ఏమిటి?" అనే స్థితికి ఆయన వెళ్ళి పోయాడన్నమాట!