పుట:Naajeevitayatrat021599mbp.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండాలే గారని ఒక బారిస్టరు. ఆయన స్మాల్‌కాజ్ కోర్టు జడ్జిగా నియామకం గాకపూర్వం, ఆ వెనుకటి రోజులలో, నా వద్ద జూనియర్‌గా పని చేశాడు. నేను వద్దని ఎన్ని విధాల చెప్పినా పండాలేగారు ప్రభుత్వం ఉద్యోగాన్ని స్వీకరించారు. మొదట్లో నెలకు వెయ్యిరూపాయల జీతం మీద స్మాల్‌కాజ్ కోర్టు జడ్జీగా ఆయన ప్రభుత్వపు కొలువులో ప్రవేశించారు. ఆయన మంచి తెలివి తేటలు గలిగి, బారిష్టరుగా బాగా రాణిస్తూన్న వ్యక్తే. కాలేజి చదువులు మంచి ధీమాగానే పూర్తిచేశాడు. అయితేనేం, ఎందుచేతనో అడ్వకేట్‌గా రాణించనేమో ననే భయం పట్టుకుని, ఆయన ప్రభుత్వ ఉద్యోగాలపై మోజు పడ్డాడు. ఆయన స్మాల్‌కాజ్ కోర్టు చీఫ్ జడ్జీ అయిఉంటే, అది ఆయన శారీరక మానసిక ప్రవృత్తులకు అనుగుణంగా ఉండేది. కాని ఆయన చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేటు మాత్రమే. చెన్నపట్నంలాంటి మహానగరాలకు చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ అంటే సామాన్యంకాదు. అవసరం అయితే, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులలో నయినా, శాంతంగా మంచి చెడ్డలు గ్రహిస్తూ, ప్రశాంత వదనంతో గుంపులను కంట్రోలు చెయ్యగలగాలి. పౌర రక్షణ, శాంతి భద్రతల రక్షణ సరిగా నిర్వహింప గలగాలి. ఎంతో నిదానం మీదగాని కాల్పులకు అనుజ్ఞ ఇవ్వకూడదు. కూర్చుని కేసులు విచారించి తీర్పులు వ్రాయడానికైతే పండాలే దిట్టమయినవాడే.

పోలీసు కాల్పులు

శాంతి భద్రతలు కాపాడడంకోసం పోలీసు బందోబస్తూ, మిలిటరీ సహకారపు టేర్పాట్లు చాలా ముమ్మరంగా జరిగాయి. సుమారు 11 గంటల వేళ, హర్తాలు పరిస్థితి ఎలా ఉంది, ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలు స్వయంగా పరిశీలిద్దాం అనే ఉద్దేశంతో నేను నా కారులో బయల్దేరాను. నేను బీచికి వెళ్ళేసరికి సెనేట్ హౌస్ వద్ద ఉంచబడిన పోలీసువారు దారిని అడ్డగించారు. అప్పుడు వెనక్కి తిరిగి, మౌంట్‌రోడ్డు దారిని వెడదామని తలిస్తే, ఆ రస్తాకూడా మూసేశారు. నేను అప్పుడు ఎగ్మూరు మీదుగా కలప అడితీలవరకూ వెళ్ళి,