పుట:Naajeevitayatrat021599mbp.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అసలు కాంగ్రెస్ మహాసభ సైమన్ కమిషన్ రాకను బహిష్కరించవలసిందనీ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలవారూ వారి రాక విషయమై హర్తాలు మొదలైనవి చేయవలసిందనీ, ఆజ్ఞాపించి ఉండగా, కార్యనిర్వాహకవర్గంవారు కాంగ్రెస్ ఆదేశానికే విరుద్ధంగా సైమన్ కమిషన్ రాకను బహిష్కరించవద్దని అనడం చాలా విచిత్రమైన విషయమనీ, ఈ విషయంలో కార్యనిర్వాహకవర్గంవారు కేవలం పొరపాటే చేశారనీ, అందువల్ల కాంగ్రెస్ ఆదేశమే ముఖ్యమూ, అనుసరణీయమూ గనుక ఆ ఆదేశానుసారం హర్తాలు జరుప వలసిందనీ మద్రాసు పౌరులకు విన్నవిస్తూ నేను ఒక ప్రకటన జారీ చేశాను. [1]

మదరాసు పౌరుల పొంగు

నా విన్నపాన్ని మన్నించిన మద్రాసు పౌరులు బ్రహ్మాండమయిన హర్తాలు జరిపారు. అది ఎంతో విజయవంతంగా జరిగింది. పూర్తి విజయాన్నే సాధించింది. ఇంత ఘనంగా, భారతదేశం మొత్తం మీద, మరే రాష్ట్రంలోనూ హర్తాలు జరుగలేదు. అన్ని కులాలకూ మతాలకూ చెందిన మద్రాసు పౌరులందరూ తమ తమ వ్యాపారాలను పూర్తిగా బందుచేసి, సముద్రం కెరటాలలాగ, కెరటంమీద కెరటంలా, భూమి ఈనిన విధంగా, చెన్నపట్నపు పురవీథుల్లోకి వచ్చేశారు. సుమారు పదిమైళ్ళు పొడుగూ, పదిమైళ్ళు వెడల్పూ గల పట్నం వీథులన్నీ జనప్రవాహంతోనూ, కోలాహలంతోనూ నిండి పోయాయి. చెన్నపట్టణానికి దూరతీరాలు వ్యాపించిన పట్నం అని పేరు.

ఆ నాడు చెన్నపట్నంలో చీఫ్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ కె. కె.

  1. ప్రకాశంగారు కాంగ్రెసు కార్యనిర్వాహకుల పునర్నిర్ణయం నిరసించి, ప్రకటన జారీచేశారు గాని, వారి తీర్మానాన్ని ఉల్లంఘించ లేదని, మొదటిసారి కమిషన్‌వారు మదరాసు వచ్చినప్పుడు ఒక లాఠీఛార్జీకూడా జరగలేదనీ డా॥ జి. రుద్రయ్య చౌదరి తమ "ప్రకాశం: ఎ పొలిటికల్ స్టడీ" అన్న పుస్తకం (పే. 56 - పుట్‌నోట్ 21) లో వ్రాశారు.