పుట:Naajeevitayatrat021599mbp.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దూరం వెళ్ళాక, హర్తాలు జరుపవద్దని ఆ కార్యనిర్వాహకవర్గం వారే, తాము చేసిన మొదటి తీర్మానానికి భిన్నంగా, ఇంకో తీర్మానం చేశారంటే - అది కాంగ్రెసు చరిత్రలోనే అపూర్వం. శ్రీనివాసయ్యంగారూ కార్యనిర్వాహకవర్గ సభ్యులే!

కార్యనిర్వాహకవర్గం తాము ప్యాసుచేసిన తీర్మానాన్ని తిరగతోడవలసిన అగత్యం ఏమీ కనబడదు. అందులోనూ నేను ఢీల్లీవదలిన 24 గంటలలో ఇంత మార్పా? దీనినిబట్టి కార్యనిర్వాహకవర్గం ఎంతటి బలహీనుల చేతులలో పడిపోయిందో తెలుస్తూనే ఉంది.

నా నిర్ణయం

నేను వెనక్కి డిల్లీ వెళ్ళాలో, మొదట్లో నిశ్చయించుకున్న ప్రకారం ముందుకు వెళ్ళి పట్నమే చేరాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో పడిపోయాను. చివరికీ వెనక్కి తిరిగి ఢిల్లీ వెళ్ళడం తలవంపుగా భావించి, ముందుకు చెన్నపట్నం వెళ్ళడానికే నిశ్చయించు కున్నాను. హర్తాలు ఆపుజేయబడడంతో ప్రభుత్వం వారి ఆంక్షకూడా రద్దయినట్లే గదా! అయినా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అని నా ప్రయాణం ముందుకే సాగించాను.

నిజానికి, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులలో నయినా, వెనుకంజ వెయ్యడమన్నది ఈ జన్మలోనే లేదు మనకి! చాలా లోతుగానూ, దీర్ఘంగానూ ఆలోచించాను. దారి పొడుగునా ఆలోచిస్తూనే ఉన్నాను. కార్యనిర్వాహకవర్గంవారి ద్వితీయ తీర్మానం చాలా పొరపాటుగా చెయ్యబడిందనీ, అటువంటి తీర్మానం న్యాయ సమ్మతమైంది కాదనీ, అందువల్ల కార్యనిర్వాహకవర్గంవారి ప్రథమ తీర్మానం ప్రకారం హర్తాలు జరపడమే న్యాయమనీ నిశ్చయించి, మద్రాసు పొరులకు హర్తాలు జరుపవలసిందిగా ఆదేశిస్తూ సందేశం ఇచ్చాను.[1]

  1. మదరాసులో 144 వ సెక్షన్ ఉల్లంఘించరాదని ఆంధ్ర, తమిళ కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గాల సంయుక్త సమావేశం నిర్ణయించిన సంగతి కీ. శే. వావిళ్ల వేంకటేశ్వరులుగారి ""ప్రకాశము పంతులుగారి జీవితము" (పే. 98, 99)లో వివరించబడింది.