పుట:Naajeevitayatrat021599mbp.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంత అణచి పెట్టినా, కాంగ్రెసులో చీలికలు తీసుకుని వచ్చేందుకు యత్నించడంతో ఎన్ని చేయగలిగినా, కాంగ్రెస్‌నించి పిలుపు వచ్చేసరికి ప్రజలూ, నాయకులు కలపి ఎటువంటి త్యాగాల నయినా చేయడానికీ సన్నద్ధులవుతారన్నది వారు ఎరగంది కాదు. అయినా కాంగ్రెసులో చీలికలు తేగలం అనే ధీమా వారికుంది. కాగా, ప్రజలకు కావలసిన 'బోధ' జరగలేదనీ, వారి ఐకమత్యానికి చేయవలసిన కృషి మృగ్యమేననీ, నిర్మాణ కార్యక్రమం అసలు పనే చెయ్యడం లేదనీ, ఈ పరిస్థితులలో సైమన్ కమిషన్ బాయికాట్ అన్నది నిస్సంశయంగా విఫలం అయ్యి తీరుతుందనీ వారు భావించారు.

ప్రజలు అక్షరాస్యులు కారనీ, తాము జరిపించిన దారుణకాండలన్నీ వారి మనస్సుల్లో భయోత్పాతాన్ని ఇంకా పచ్చగానే ఉంచి ఉంటాయని బ్రిటిషువారి నమ్మిక. నిజమే. నిర్మాణ కార్యక్రమాలేవీ కొనసాగని పరిస్థితులలో ప్రభుత్వంవారు అల్లా తలచడంలో ఆశ్చర్యం లేదు. కాని వారికి భారత పౌరులయొక్క అఖండ శక్తీ, నరనరాలలోనూ నాటుకుపోయిన వారి అహింసాతత్వం, అహింసామార్గాన్నే దేనినయినా సాధించగలమనే వారి అచంచల విశ్వాసం అర్థం అయి ఉండవు. అక్షరాస్యులూ, నిరక్షర కుక్షులూ అన్న పదాలకు చెప్పబడే అర్థాలు ఏవయినా, ప్రజాబాహుళ్యం మాత్రం, కమిషన్ వారు దేశంలో అడుగుపెట్టిన అ మొదటి రోజునుంచీ అవసరమయిన త్యాగాల కన్నింటికీ సంసిద్ధులయ్యే ఉన్నారు. అందుకు నిరక్షరాస్యతగాని, శిక్షణ లోపంగాని అడ్డురాలేదు.


ద్వితీయ ఖండం సమాప్తము